పుట:కవికర్ణరసాయనము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సంచారోద్ధతు లైనరక్కసుల నాశ్చర్యంబుగా వేల్మిడిం
జించెం ద్రుంచె వధించె నొంచె నొలచెం జెండాడెఁ జండాకృతిన్.

206


క.

మిడియుతల తునియునడుమును, బడుతొడయును విఱుగుకాలు పగులుతనువు లై
బడలువడి యసురబలములు, పొడ వడఁగె న్విభునిబాణములవెల్లువలన్.

207


క.

పరహృదయకమలభేదక, శరకిరణసహస్రకర్కశం బై మనుజే
శ్వరకరవలయిత మగువిలు, పరికింపఁగఁ దత్ప్రతాపభాస్కరుఁ డయ్యెన్.

208


క.

కనుఁగొన నొకఁ డయ్యు మహ, త్యనుమిత మై నైక మయ్యె నధిపతి తెగ కె
క్కినతూపు తీవ్రభావం, బున దీపజ్వాలవోలె భువనాద్భుత మై.

209

మాంధాతృరావణు లొండొరుల నధిక్షేపించుకొనుట

మ.

అది యెల్లం గని రావణుండు లయకాలాగ్నిక్రియ న్మండుచుం
బదిదిక్కు ల్పదినోళ్లచేతఁ గబళింపం జూచుచందంబునన్
వదనౌఘం బపు డట్టహాసరచన వ్యాలోలజిహ్వాభయ
ప్రద మై యుండఁగ విస్ఫులింగములు నేత్రశ్రేణి వర్షింపఁగన్.

210


క.

నిలు నిలు నృప! నీ వగుదువు, బలియుఁడ! నీబీర మెల్లఁ బదిలపఱపు నీ
పలలములు నీకు నోడిన, పలభుక్కులమునకుఁ బంచి పాలిడువాఁడన్.

211


గీ.

కాదు వో వేఁగునాఁడు ముక్కంటితోడ, వెండికొండయు నాభుజాదండమునకు
దురము గఱ వౌట నైన ప్రాఁద్రుప్పుతోడి, చంద్రహాసంబురీతి నోజనవరేణ్య!

212


క.

బలిభిత్ప్రభృతు లెదుర్పడ, బలవంతులు గామిఁ బ్రాఁతవడినకృపాణం
బులు గడుగువాఁడ నిదె నీ, గళరక్తముచేత నేఁడు ఖరకరవంశా!

213


గీ.

అనినఁ దద్వచోనిలాహతిఁ గోపాబ్ధి, వెల్లివిరిసి నెఱసి వేల ముంచి
తొట్టి మెఱయునురుగుదెట్టువవోలెఁ గె, మ్మోవిఁ జిఱుతనవ్వు మొలకలెత్త.

214


క.

తనుఁ దానె పొగడుకొను టిది, ఘనమతులపథంబు గాడు కైదువచేతం
గొనియుండియు నసురాధమ! పనిమాలిన రజ్జు లాడఁ బౌరుష మగునే.

215


వ.

అనిన మిగులం గోపించి.

216

మాంధాతృరావణుల ద్వంద్వయుద్ధము

క.

ఒక వింటికిఁ బదివిండ్లను, బ్రకటించినఁ గాదు నాకుఁ బంతము పరిపం
థికిఁ బెంపొసగుట యని వి, ల్లొకటనె దనుజేంద్రుఁ డేసె నుగ్రాస్త్రంబుల్.

217


మ.

అవి దోడ్తోఁ దునుమాడి భూవరుఁడు నుగ్రాకారుఁ డై శింజినీ
రవ మాశాంతరముం జెవుడ్పఱప నారాచంబు లొక్కుమ్మడిం
గవియింపం దశకంఠుఁ డద్భుతరసక్రాంతాత్ముఁ డై హస్తలా
ఘవ మగ్గించి తదీయబాణవితతుల్ ఖండింపరా కుండుటన్.

218