పుట:కవికర్ణరసాయనము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నితఁ డితఁ డీతఁ డీతఁ డితఁ డీతఁ డితం డితఁ డంచు నింక నే
నితరులు వోలె నిప్పు డిహిహీ! వెడపంతము లాడ నేర్తునే?

142

రావణుఁడు మాంధాతపై దాడి వెడలుట

క.

అని సామంతులపంతపుఁ, బెనుగాడ్పులతరతరంబు పెరిగెడునసురే
శునికినుపుగడలి మెఱసెనొ, యనఁ దిగి ప్రస్థానభేరి యంతట మ్రోసెన్.

143


మహాస్రగ్ధర.

బలగర్జానాదవేదప్రణవరవణమై ప్రాణిహింసారిరంసా
బలికాలక్ష్వేళితాపోపమయి కలహభుక్పారణామంత్రణం బై
బలవిద్విట్పౌరకన్యాపరిణయకలనాబంధురాశీఃపదం బై
పలభుగ్భర్తృప్రయాణప్రతిహటపటహప్రౌఢరావం బెలర్చెన్.

144


సీ.

వింధ్యాద్రిఁ గలయఁ బర్వినకారుమొయిలు నాఁ, గఱుకునెమ్మేన మైమఱువు దొడిగి
మున్నీటిపై మండుపెన్నేటిచిచ్చుపై, ఠవణించుమణికిరీటములు దాల్చి
మదహస్తి పెఱికినమ్రాను చేకొనునట్లు, విస్మయం బగునొక్కవిల్లు పూని
ప్రళయపర్జన్యుండు సవిపరంపరవోలె, నదురు లీనెడునంపపొదులు పూని


గీ.

యుగ్రకరుఁడు వెండియు నమోఘనైదాఘ, తీష్ణగతి వహించుతెఱఁగు దోఁప
గ్రూరుఁ డైనదనుజకులభర్త భయదస, న్నాహకలితుఁ డగుచు నడరె ననికి.

145


వ.

ఇట్లు సమరసన్నాహదోహలంబున రావణాసురుండు విగ్రహం బెత్తి యాగ్రహంబున
మూర్తీభవించినపరాక్రమంబున నాకారంబు గైకొన్నమాత్సర్యంబునఁ బురుష
భావంబు భజించినక్రౌర్యంబున నవయవంబులు భయంకరత్వంబున దుర్ణిరీ
క్షుండును దుస్సహుండును దుర్లివార్యుండును నగుచుఁ జిరమనోరథసిద్ధి
యైనయుద్ధంబు గలిగినపరమలాభంబున నుల్లంబునం బట్టువడనిమహోల్లాసంబు
వదనదశకంబునకు మందహాసవికాసంబు నొసంగ నగరు వెడలి నిజోద్యోగాను
రూపంబుగా నున్నతం బైనకామగమనం బైనరథంబు నారోహించి సామంత
మంత్రిసుతహితాదివర్గంబు లనర్గళారంభంబున నిరుపక్కియలం బిక్కటిలి సేవింప
ధవళచ్ఛత్రడిండీరంబుగాఁ దనయందు వెల్లివిరియువీరరసప్రవాహంబున కలంకారంబు
గా విహారంబు చూపుచామరమరాళంబులకరాళదంష్ట్రాప్రభాపూరంబులు ముకు
టంబులు సంపాదింప శంఖకాహళీసంధుక్ష్యమాణం బగుచుఁ బాఠకపఠనముఖరంబు
గా నుద్దీపించునిజప్రతాపపావకునకు సముత్తాలకీలాకలాపంబు లై ముందఱ నందంద
సందడి జడియుచుం గనత్కనకవేత్రపరంపరలు వర్తింప నరుదెంచునపుడు ప్రియా
దత్తగండూషహాలారసాస్వాదనంబున రణోన్మాదం బెత్తి తత్తరంబున దొరలు పాయం
దట్టినపట్టెంబు లంకించుచుఁ దమనీడలుదారు వెన్నాడుచుం బఱతెంచువెక్కసపుఁగఱకు