పుట:కవికర్ణరసాయనము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

గుడిమ్రింగువానికి గుడితలుపు లప్పడంబు లని చెప్పవలెనె? యీచందంబున శతమఖ
ప్రముఖులం జెఱపట్టిన రావణునకు నధమమర్త్యులు మీరు లక్ష్యంబు గా రని యెన్న
నేల? తలంగి పోయినం గట్టువడి బ్రదుకలే రగుట బుద్ధిమంతు లైన నమ్మి నావెంటనే
వచ్చి యతనిమ్రోల శరణంబు నొంది ప్రాణంబులు గాచికొనుం డని పలికిన.

125


సీ.

అరుణాయమానంబు లై చూపు లొదవంగ, నిండార దెసలు తీరెండఁగనియె
నత్యుష్మగ్రీష్మంబు లై యూర్పు లొలయంగ, గాఢంబుగా వడగాడ్పు వీచె
నాసారవర్షంబు లై స్వేదములు గ్రమ్మ, మణికుట్టిమస్థలి మడువుకొనియె
నహహశబ్దమయంబు లై హాసములు పర్వఁ, గ్రందుగా వీతెంచెఁ గలకలంబు


గీ.

దైత్యకులభర్తృభృత్యధూర్తప్రతాప, దండహతపుండరీకోగ్రదండనాథ
నిర్నిరోధాగ్రహావేశనియతివలన, మనుకులాధీశునాస్థానమండపమున.

126


వ.

అప్పు డవ్విభుండును నిటలకుటిలభృగుటీకుటీకపటంబునం బొగసినదైత్యకులభర్తృ
భృత్యరోషానలంబునం బొలయుకీలలచెలువునం గనుంగొనలం గెంపు గదుర నెదుర
నున్నదూత జుఱచుఱం గనుంగొని.

127


క.

దూత నని వెఱక ప్రేలేదు, దైతేయాధముఁ డెదిర్చి తానై యని కి
ట్లేతెంచుపనికి మదిలోఁ, గాతరుఁ డై నోరఁబోటుఁ గఱపె న్నీకున్.

128


చ.

కొలిచినవారినేరమునకుం బతి దండ్యుఁడు గాన నిఫ్టు నీ
పలికినప్రల్లదంబులకుఁ బ్రాప్యఫలంబుగ నెల్లి యాజిలో
నిలిచినయేని దూతవుగ నిన్నిటు పంపినరాక్షసాధమున్
సెలవులు వాయఁ ద్రొక్కి వెస జిహ్వ యసిన్ మొదలంటఁ గోయుదున్.

129


ఉ.

మేరునగంబునివ్వలిసమీపవసుంధర సంగరస్థలం
బోరి! నిశాచరాధముని నుగ్రకరుం డుడయాద్రి కెల్లి దో
తేరకమున్న పోరి కరుదెమ్మను రజ్జులు ప్రేలి రానినాఁ
డూరక పోదు సుమ్మి నకులోగ్రకృపాణిక రేఁచిపెట్టునన్.

130


క.

అని వాని వెడలఁ ద్రోయం, బనిచి మహీపాలుఁ డెల్లి బవరముసుండో!
యని నిఖిలసైన్యములకును, జనితోత్సాహముగ వీటఁ జాటించుటయున్.

131


సీ.

కైదువు లర్చించి కలయర్థ మంతయు, నిలుఁ జూఱ యర్థుల కిచ్చువారు
కదనోత్సవత్వరఁ గను మూయు నెఱుఁగక, కోర్కి మై వేబోకఁ గోరువారు
వెడనిద్రఁగలలోన విమతుఁ గూల్చితి మని, కలువరింతలఁ బేరుపలుకువారు
పొలయల్క లెడలించి పొలఁతులచే బిగ్గఁ, గంఠగ్రహప్రీతిఁ గాంచువారు


గీ.

భానుబింబంబు ఛేదింపఁ బంతమాడి, యించుపడఁతులమతులు భేదించువారు
నగుచు బలయోధు లా రేయి యనుభవించి, రాహవోత్సాహసన్నాహహర్షరసము.

132