పుట:కవికర్ణరసాయనము.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నగుచు నడచె లెక్క కగ్గలం బై సేన, యఖిలభువనవితతి నాక్రమింప
నుగ్రరభసలీల నుద్వేల మై త్రోచు, బహుళవిలయజలధిలహరు లనఁగ.

70


శా.

ప్రస్థానారభటీవిశృంఖలచమూరాసోత్థితాంతర్మదా
వస్థం భద్రగజంబె సైనికులత్రోవం బోవఁగానీక మా
ర్గస్థం బైనతెఱంగు నైనజయముం గల్పింతు భూభర్తకున్
స్వస్థానస్థితి మీరు నిల్పుఁడమనచ్చందంబు గాకుండునే?

71


ఉ.

కత్తి కళేబరం బొరయఁ గా నెలవు ల్దెగి క్రమ్మునెత్తుటన్
జొత్తిలి నోర జొ ల్లలరఁ జూపఱకుం దలఁపించె నయ్యెడన్
మత్తిలి వాగెవెక్కసపుమావు పయోనిధివారివారణా
యత్తమహానలంబు నరుదారఁగఁ గ్రక్కెడు తొంటిగోడిగన్.

72


మ.

అనతారాతివిఖండనప్రవణ భాహాగర్వదుర్వారు న
మ్మనువంశోత్తముఁ జెందినట్టి ప్రమదోన్మాదాతిరేకంబు పెం
పున విశ్వంభర మిన్నుముట్టె ననఁగాఁ బొంగారెఁ దద్భూమిభృ
ద్ఘనసేనాపదఘట్టనోత్థితవియద్వ్యాప్తక్షమారేణువుల్.

73


సీ.

అంబరజంబూఫలంబున కగచరు, లుగ్రరోచికి రాహువిగ్రహములు
అష్టదిఙ్ముఖముల కవకుంఠనంబులు, మఘవత్కరి కపూర్వమజ్జనములు
కులమహీధరములకు నవాభ్రపంక్తులు, జలరాసులకుఁ గుంభసంభవములు
శాత్రవవదనాంబుజములకుఁ దుహినము, ల్ధర లోకదృష్టికి దర్శనిశలు


గీ.

నెఱసె సర్వంకషంబు లై నిబిడగతుల, వివిధరథనేమిహరిఖురద్విరదచరణ
భటపదభ్రమణత్వరోత్పాదితములు, రాజవరదండయాత్రాధరారజములు.

74


గీ.

బలవిరావమునకుఁ బ్రతిఘోష మొసఁగెడు, కులనగంబులంత గుహలు నిండ
నిబిడధూళి పర్వ నిశ్శబ్దగతి నుండె, నెలుఁగురాసి పలుకు వెడలనట్లు.

75


గీ.

ఆత్మ మదవృష్టిచే నేల యందువాసి, మీఁద దళ మైనధూళిచే మెఱసి యపుడు
ధరణి మోచినహరిదంతదంతికులము, భావ మెఱిఁగించె సేనామదావళములు.

76


గీ.

దానధారలచే ధరాతలము గడిగి, హస్తముఖబిందువుల విహాయసము గడిగి
సైన్యరేణువు నడఁగించె సామజములు, సత్వనిధు లోప రెట్లు రజంబు నడఁప.

77


చ.

తమకు నయత్నసిద్ధముగ దానము లై యలరించు భూప రా
గము లన వానిచేఁ దమకుఁ గల్గెడుదానజలాతివృష్టిచే
సమయఁగఁ జేయఁ జొచ్చెఁ బటుసైన్యమదేభకులంబు లప్ప ని
క్కము నదియట్ల మత్తు లుపకర్తల కేనియుఁ గీడు సేయరే?

78