పుట:కవికర్ణరసాయనము.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సరస్వతీస్తుతి

శా.

కాసారంబులు సాహిణంబులు సరిత్కాంతుండు పూఁదోఁట వి
ద్యాసీమంబులు రచ్చపట్లు సురకాంతాలోకసీమంతభూ
షాసిందూరము పాదలాక్ష యగుభాషాదేవి మత్ప్రౌఢజి
హ్వాసింహాసన మూనుఁ గాతఁ గృతియుక్తాలంక్రియాహంక్రియన్.

5


వ.

అని యభీష్టఫలప్రదపరమపురుషప్రార్థనంబును గావ్యసాధారణలక్షణోపస్థాపనాభిప్రాయంబున నితరోచితదేవతానిరూపణంబునుం గావించి.

6

కృతికర్తృజ్ఞాపనము

క.

గురువరభట్టపరాశర, చరణసరోరుహసముల్లసన్మానసుఁడన్
నరసింహనామధేయుఁడఁ, బరిచితసత్కృతిరసానుభవహేతువునన్.

7

సత్కవి ప్రశంస

చ.

మనమునఁ గొన్ననెవ్వగలు మాన్పి ఘటింతురు కావ్యసమ్మదం
బనఘకథాముఖంబున హితాహితబోధ మొనర్తు రింపుగాఁ
గనుఁగొనుకంటె నద్భుతముగా నెఱిఁగింతు రతీంద్రియార్థముల్
ఘనమతు లెల్లవారికి నకారణబంధులు గారె సత్కవుల్.

8


వ.

అందున.

9

మిశ్రకావ్యప్రశంస

గీ.

కావ్య ముత్పాద్య మైన సత్కావ్య మింక, నుక్తకావ్యంబ యే పునరుక్తిఁ దెచ్చుఁ
గానఁ గవితాభిముఖుఁ డైనకవివరునకు, మిశ్రకావ్యంబె కావ్యమై మెఱుఁగు దెచ్చు.

10

కాకవినిరాకృతి

క.

నేరిచిన సుకవి కృతిచేఁ, బే రెఱిఁగించుకొని జగతిఁ బెంపగు టొప్పున్
నేరకకృతిఁ జెప్పుట దన, నేరమి యపకీర్తి జగతి నిలుపుట గాదే.

11


క.

ఏరసముఁ జెప్పఁ బూనిన, నారస మాలించువారి కడరింపనియా
నీరసపుఁగావ్యశవముల, దూరమున న పరిహరింపుదురు నీతిజ్ఞుల్.

12


చ.

ఫణితులు రెంట మూఁట నొకపద్యము గూరుచువారు లక్ష్యల
క్షణసహకావ్యనిర్వహత గల్గుట చిత్రము గాని యట్లపో
ఫణిమణిమాత్రధారు లగుపాము లసంఖ్యము గాక తత్ఫణా
మణివిధవిశ్వభూభృతిసమర్థుఁడు శేషుఁడు గాక కల్గునే.

13


క.

ఆకులనె యుండుకవితా, పాకములనె మొదలు చెడినప్రాఁదప్పులయా
లోకము జిహ్వాంచలముల, యాకులు గాకుండు నెవ్వి యవివో కవితల్.

14