పుట:కవికర్ణరసాయనము.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

కవికర్ణరసాయనము

పీఠిక

శ్రీరంగనాథస్తుతి



రామావసుధాపయోధరములం జేదోయిరెంట న్సమ
ప్రారంభంబునఁ జిత్రభంగి మకరీపత్రాంకము ల్వ్రాసి ని
ర్వైరప్రేమల నిద్దఱందు సమసారస్యంబునం దేలునా
శ్రీరంగేశుఁడు మమ్ము నిర్మలసుఖశ్రీయుక్తులం జేయుతన్.

1

బ్రహ్మస్తుతి

చ.

పొలయలుకన్ జపంబునకుఁ బూనుకనుంగవ లెల్ల మోడ్చియుం
దలఁపున మంత్రవర్ణమయతం గనుపట్టినవాణిఁ జూచి న
వ్వొలయఁ గవుంగిలించి సుసుఖోన్నతిఁ జెందెడువిశ్వతోముఖుం
డెలమి దలిర్ప మత్కృతికి నీవుత విశ్వజనాభిముఖ్యమున్.

2

శివస్తుతి

మ.

ముకుటాగ్రస్థితచంద్రచంద్రిక సదా ముంపం ప్రభావం బెఱుం
గక శశ్వత్పరిరంభణావితతసౌఖ్యస్నిగ్ధుఁ డై జాయఁ బా
యక లీలాపరుఁ డైనశంకరుఁడు నిత్యప్రీతి సంధించుతన్
సకలాహ్లాదము గా మదీయకృతికి నశబ్ధార్థదాంపత్యమున్.

3

విఘ్నేశ్వరస్తుతి

మ.

నను మన్నింపుము నీకు మామ యగుమైనాకంబు నాకాధినా
థునిమోలం బడు నంచుఁ బార్వతి వియద్ధూత్కారము న్మాన్చినం
దనతుండంబునఁ బీల్చియున్న జలధిం దాఁ గ్రమ్మఱం గ్రుమ్మరిం
చినశుండాలముఖుండు మామకకృతిశ్రీ కిచ్చు నిర్విఘ్నతన్.

4