పుట:కవికర్ణరసాయనము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

హితు లగుదు రహితవర్గము, హితమతిఁ బోప్రాణ మైన నీఁ జూచు హితా
హితతతిగతరూపజగ, త్త్రితయనువశ్యౌషధములు ప్రియభాషణముల్.

7


క.

కా కేమి తన్నుఁ దిట్టెనె?, కోకిల తన కేమి ధనము కోకొ మ్మనెనే?
లోకము పగ యగుఁ బరుసని, వాకునఁ జుట్ట మగు మధురవాక్యమువలనన్.

8


గీ.

ఉన్నసాధనగతుల సాధ్యుండు గాక, మ్రింగఁ బఱతెంచుశత్రువు మిత్రుఁ జేయు
దానమున నాత్మవశగులు గానివార, లితరు లెవ్వార లీజగత్త్రితయమునను.

9


క.

శత్రుల మిత్రులఁ జేయు, మిత్రుల భృత్యులుగఁ జేయు నిజగుణవృత్తిం
బాత్రులుగఁ జేయు నందు, ధాత్రీపతి కన్నియెడల దానము తగదే?

10


క.

ఆయాసదుర్లభముల న, నాయాసమునన ఘటించు ననభిస్పృష్టా
పాయంబు పతికి భేదో, పాయము గడు నిష్ట మగునుపాయముగాదే?

11


క.

అరుల విదళింపఁ గానే, నరపతి తేజస్వి యగుట నడురేయియిరు
ల్విరియించునపుడు దీప, స్ఫురణము దగుఁ గాక పగలు చొప్పడి యున్నే?

12


క.

దండసమర్థుఁడు పతి గా, కుండిన సేవకులు నులుక రుగ్రారికుభృ
న్మండల ములుకునె? కావున, దండసమర్థుండు గాఁగఁ దగుభూపతికిన్.

13


క.

పౌరుషము గలుగఁగానే, సారము లను భేదదానసామములు సమి
ద్భీరువున కవి ఫలింపఁగ, నేరవు షండునకు నింతినేపథ్యంబుల్.

14

సహాయస్వరూపనిరూపణము

వ.

ఇవి ప్రధానప్రకారంబులు. మఱియు నుపేక్షాదులు నగు ప్రకారాంతరంబులు నెఱుంగు
నది, యిది యుపాయస్వరూపనిరూపణం బయ్యె. నింక సహాయస్వరూపంబు విను.
మఱియు రాష్ట్రదుర్గధనాదిసంపద్రూపంబున మంత్రిసామంతసుహృద్బలదూతచార
ప్రభృతిపురుషసంపత్తిరూపంబున బహుప్రకారం బై యుండునవి. యిన్నియు నవ
శ్యంబు లగుటకుం బ్రత్యేకగుణంబు లాకర్ణింపుము.

15


గీ.

అరులవలనఁ గాచుకరణి మేనుతెవుళ్ల, వలనఁ గాచుకొనఁగవలయు నట్ల
యరులవలనఁ గాచుకరణిని నైజాధి, కారిజనులవలనఁ గావవలయు.

16


క.

ప్రోదిఁగొనఁదగినఃపుష్పఫ, లాదులు గొడ్డంట వ్రచ్చి యవనిజము నెడన్
వాదుగొనునట్ల భూప్రజ, బాధించిన నేల కలుగు పతి కరిగోరుల్?

17


క.

మన సిచ్చినఁ దన కోడరు, చను విచ్చినఁ బ్రజలు వెక్కసము సేయుదు రౌ
ట నృపతి మన సీకయ కడుఁ, జను వీకయ మెలపవలయు సమ్ముఖచరులన్.

18