పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గల పొట్టిదొకతె ముందుకు వచ్చి ముక్కు మీద వ్రేలు వైచికొని "ఓసీ! వెంకమ్మా! రాత్రి శేషమ్మను మగడు కొట్టినాడట! విన్నావా?"

వెంకమ్మ - "దానిని మగడెప్పుడును ఆలాగుననే కొట్టుచుండును. నెల దినముల క్రింద కఱ్ఱ పుచ్చుకొని కొట్టినప్పుడు చేతి గాజులన్నియు పగిలిపోయినవి."

పొట్టి - "దానిని మగడు తిన్నగా ఒల్లడట." అని బుగ్గను చేయి పెట్టుకొని "ఓసీ! ఓసీ! అతడు ముండ నుంచుకొన్నాడట సుమీ."

బట్టతల ముత్తైదువ యొకతె చేతులు త్రిప్పుకొనుచు ముందుకు వచ్చి "సరి సరి! దాని గుణము మాత్రము తిన్ననిదా? మొన్న సుబ్బావధానుల కొడుకుతో మాటాడుచుండగా మగని కంటనే పడ్డదట! మగవాడేలాగున నున్నను దోషము లేదు. ఆడదాని గుణము తిన్నగా నుండనక్కఱలేదా?"

పొట్టి - "దానికేమి గాని, పాపము! చిన్నమ్మను అత్తగారు లోకములో లేని కోడంట్రికము పెట్టుచున్నది. అంతే కాకుండ మగడింటికి వచ్చునప్పటికేవో నాలుగు లేనిపోని నేరములు కల్పించి చెప్పును. దాని మీద అతడు ప్రతిదినమును దానిని చావగొట్టుచుండును."

పదియాఱు సంవత్సరముల వయస్సు గల యొక చామనచాయది కన్నుల నీరు పెట్టుకొనుచు - "అత్తగారు బ్రతికియున్న చోట్ల నెల్ల నిదే కర్మము. లోకములో అత్తలెల్ల ఒకేసారి చచ్చిరా ... "

పొట్టిది - "శేషమ్మా! నీ అత్తగారు కూడ నిన్ను చాలా బాధ పెట్టునని విన్నాను. నిజమా?"