పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వేళ తిన్నగా కట్టి జాతకము వ్రాసిన యెడల, అందులోనెన్ని యక్షరములున్నచో అన్ని యక్షరములును జరుగును. శాస్త్రము చక్కగా తెలియనివారు తిన్నగా వేళ కట్టలేక పాడు చేయుదురు. మావారు ఇన్ని ముహూర్తములు పెట్టినారు గదా? నీ వెఱిగినంత వఱకు మఱియొక విధముగా నెక్కడైన జరిగినదేమో చెప్పు"

రు - "కన్నమ్మ గారి బుచ్చమ్మ వివాహ ముహూర్తము మా చావడిలో మన సిద్ధాంతిగారే పెట్టినారు గాని దాని మగని జాతకము కూడ సిద్ధాంతి గారే వ్రాసి ... "

పె - "అవును ఒకానొకటి తప్పిపోవుటయు గలదు. జ్యోతిషమునకు బార్వతి శాపమున్నదట! మావా రెప్పుడును ఈ సంగతినే చెప్పుచుందురు. గట్టు మీద మట్టెల చప్పుడగుచున్నది. ఎవ్వరో వచ్చుచున్నట్లున్నారు. ఈ పాటికి మనమీ సంగతి చాలింతము" అని వెనుక తిరిగి చూచి బిందె యొడ్డున నుంచి స్నానమునకు నీళ్లలో దిగుచున్నది.

ఇంతలో గొందఱు పుణ్యస్త్రీలును విధవలును మెట్టు దిగుచు ముందున్నవారు వంగి కాళ్ల వెండి పావడములను కొంచెము పయికి దీసికొనుచు వెనుక దిరిగి దూరమునున్నవారు వచ్చువఱకు దగ్గఱ వారితో మాటలాడుచు మెల్లమెల్లగా నీటి సమీపమునకు వచ్చి గృహకృత్యములను గుఱించి మాటాడుకొనుచు బిందెల నొడ్డున బెట్టిరి. అందఱును నొక్కచోట సమావేశమయి సావకాశముగా మాటాడుకొనుటకు నీళ్లకు వచ్చినప్పటికన్న మంచి సమయము స్త్రీలకెప్పుడును దొరకదు గదా? అందుచేతనే వారు సాధారణముగా కొంచెము తీఱుబడి చేసికొని మాటాడవలసిన నాలుగు మాటలను నీళ్లకు వచ్చినప్పుడే మాటాడుకొని పోవుదురు. అప్పుడు ముప్పదియేండ్ల యీడు