పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విడుచుచు, అప్పుడప్పుడు ప్రదక్షిణములు చేయుచుండెను. ఆవఱకే వచ్చియున్న కొందఱు స్త్రీలు తమ యిత్తడి బిందెలను నీళ్లలో బెట్టి రేవునకు సమీపముగానున్న రాళ్లపయిని నిలుచుండి యొక్కొక్క పెట్టు వేయుచు మధ్యమధ్య నొక్కొక్క మాట చెప్పుకొనుచు బట్టల నుతుకుకొనుచుండిరి; ఒక వృద్ధాంగన సగము బట్ట కట్టుకొని తక్కిన సగము నుతుకుకొన్న తరువాత, ఉతికిన భాగమును మార్చి కట్టుకొని మిగిలియున్న భాగము నుదుకుకొనుచుండెను; కొందఱు వయసులోనున్న స్త్రీలును గోప్యముగా నుంచదగిన తమ యవయవములు స్నానము చేయునట్టియు గట్టున నున్నట్టియు పురుషులకు గనబడునట్లు సిగ్గువిడిచి తొడుగుకొన్న రవికలను దీసి యుదుకుటకయి తాము కట్టుకొన్న వస్త్రముల నక్కడనే విప్పి యావఱ కుదికిన వేఱు తడి బట్టలను చుట్టబెట్టుకొనుచుండిరి. ఆవల పది బారల దూరమున దాసీజనములు క్రిందబడిన మెతుకులకై కావుకావని మూగిన కాకులను చేయెత్తి యదిలించుచు అంటుతప్పెలలను ఒడ్డున బెట్టుకొని తోముకొనుచుండిరి. ఆ పయిని బెస్తలు పుట్టగోచులతో మొలబంటినీటిలో నిలుచుండి వలత్రాడు మొలత్రాడునం దోపుకొని రెండు చేతులతోను వలను త్రిప్పి లోతు నీళ్లలో విసరవైచి మెల్లమెల్లగా లాగుచుండిరి. మఱికొందఱు లాగిన వలలను నీళ్లలో బలుమాఱు జాడించి యంటుకొనియున్న బురద పోయిన తరువాత గట్టునకు దీసికొని వచ్చి చివర దగిలించియున్న యినుపగుండ్లు గలగలలాడ వలలను విప్పి రాయిరప్ప క్రింద బారవైచూచు నడుమ నడుమ వలకన్నుల సందున నుండి మిట్టిమిట్టిపడు చిఱుచేపలను చేతులతో నదిమిపట్టి మీలపుట్టికలను చేత బట్టుకొని నిలుచున్న పిన్నవాండ్ర చేతి కందిచ్చుచుండిరి. ఆ పయిని నాలుగడుగులు నడిచిన తరువాత దినమున కాఱణాల పాటుపడగలిగిన యొక సోమరిపోతు నీళ్లలోనున్న నడదోనె మీదికెక్కి నల్ల యన