పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

సౌందర్యవతులని యొప్పుకొన్నవారిలో చక్కనివారి నేరి యామె చెంత నిలిపినచో గురూపురాండ్ర నిపించెడి యామె మనోజ్ఞత నేమని పిలువవలెనో తెలియకున్నది. అపూర్వ వర్ణనాసామర్థ్యము గల కాళిదాసాది కవులలో వొకరినైనను బోలజాలని నేను, ఉన్నత సౌందర్యమును బోధించు పదములు లేని భాషతోను, పదములు బోధించునంత వఱకైన బూర్ణముగా దెలుపలేని బుద్ధితోను వర్ణింపబూనుట యామె చక్కదనము యొక్క గౌరవమునకు గోరంత కలుగజేయుటయే గదా! అయిననూ యోగ్యవస్తువు దొరికినపుడు వర్ణింపక మానుట యుచితము కాదు కాబట్టి, యీ సృష్టిలోని వస్తువులతో వేనితోనైనను పోల్చి యీ పుస్తకముం జదువువారి కామె యవయవముల యొక్క రూపము నించుక మనస్సున బుట్టింతునన్నను ఆమె యంగముల నెంచి యా వస్తువుల పేరు చెప్పుటకె సిగ్గు వొడముచున్నది. వేయేల? చతుర్ముఖుడును ఘుణాక్షరన్యాయమున బడిన యామె రూపమునకు దలయూచి, తన యపూర్వ వస్తునిర్మాణచాతురిని మెచ్చుకోకపోడని యామెం జూచినవారెల్లరు నెంచుచుందురు. ఆమె శరీరశ్ఛాయం జూచిన, ఇక నీ భూమి మీద బంగారమునకేమి చాయ యెక్కువ గలదని తోచును; నల్లగానుండునేని, విండ్లామె కనుబొమలం గొంచెము పోలియున్నవని చెప్పవచ్చును; నేత్రములను జూచిన భాగ్యదేవత వాని యందే కాపురము కుదిరినట్టు కనిపించును; కాని, నిపుణముగా బరిశీలించినచో నేదో స్థిరవిచారమొకటి యామె హృదయపీఠమున నెలవుకొనియున్నట్టు ముఖలక్షణములు కొంచెము సూచించుచున్నవి. ఆ విచారమునకు గారణము లేకపోలేదు. ఆమె పెనిమిటి సహవాసదోషము చేత నాఱు నెలల క్రిందట దలిదండ్రులతో జెప్పక దేశాంతరము లేచి పోయినాడు.