పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవ ప్రకరణము

రాజశేఖరుడు గారి కూతురు రుక్మిణి స్నానమునకు వచ్చుట - నదీతీర వర్ణనము - రుక్మిణికిని సిద్ధాంతి గారి భార్యకును జరిగిన సంభాషణ - నీళ్లకు వచ్చిన యమ్మలక్కల ప్రసంగములు - పంచాంగపు బ్రాహ్మణుడు వచ్చి సంకల్పము చెప్పుట - రుక్మిణి స్నానము చేసి బయలుదేఱుట.

రాజశేఖరుడు గారు పౌరబృందముతో నాలుగడుగులు ముందుకు సాగిన తోడనే యొక సుందరి సుందరగమనముతో బాదముల యందలి యందియల మ్రోత మట్టియల మ్రోతతో జెలిమి సేయ, మొలనున్న వెండి యొడ్డాణము యొక్కయు, ముంజేతుల పసిడి కంకణముల యొక్కయు, గాజుల యొక్కయు కాంతులు ప్రతిఫలించి కుడిచేతిలోని తళతళలాడుచున్న రాగిచెంబునకు జిత్రవర్ణమొసంగ, మోమున లజ్జాభయములు నటియింప, పయ్యెద చక్కజేర్చుకొనుచు తిన్నగా దలవంచుకొని మెట్లు దిగివచ్చి చెంబును నీటి యొడ్డున నుంచి చెంబుమూతి కంటించియున్న పసుపుముద్దను దీసి కొంత రాచుకొని మోదుగాకులో జుట్టి తెచ్చుకొన్న కుంకుమపొట్లము నొక బట్టయుతుకు రాయిపయింబెట్టి, మోకాలిబంటి నీటిలో నిలుచుండెను. ఆమె రాజశేఖరుడు గారి పెద్దకూతురగు రుక్మిణి - ఆహా! ఆమె సౌందర్యమును బ్రత్యక్షమున జూడ నోచినవారి కన్నులే కన్నులు. ఆ కాలమున హిందూ దేశమునందలి సుందరులలోనెల్ల దెనుగుదేశములోని వారే రూపరేఖావిలాసముల చేత నసమానలుగా నుండిరి; వారిలోను బ్రాహ్మణజాతి నాతులు మిక్కిలి చక్కనివారు. కాని రుక్మిణి రూపమును దలచినప్పుడు మాత్రము, ఆ సుందరులొకసౌందర్యవతులని చెప్పుట కెల్లవారును సంకోచ పడుచుందురు. జనులందఱును మిక్కిలి