పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పిల్లలు చెంగుచెంగున దమ ముందఱ దుముకులాడుచుండ గొండ పొడుగునను ముంగాళ్లు మీదికెత్తి పొదలపయి యాకులను మేయు మేకలును, పూర్వదక్షిణముల గుప్ప వోసినట్లున్న తాటాకుల యిండ్ల నడుమ వానిని వెక్కిరించున ట్లక్కడక్కడ నెత్తుగానొక్కొక్క పెంకుటిల్లును ఉత్తరమున మంచెలపై నుండి పొలముకాపులు కోయని కూతలిడుచు నొడిసెలలు ద్రిప్పుచు బెదరింప జేరువ తోపులలో నుండి వెలువడి మధురరుతములు చేయుచు ఆకాశమున కెగయుచు సందయినప్పుడు కంకులను విఱుచుకొని పఱచి పలువిధములయిన పక్షులు చెట్ల కొమ్మల మీద బెట్టుకొని తినుచుండ ముచ్చటగా నుండు పలువిధముల పచ్చని పయిరులును, ఆ పయిని వృక్షముల మీదను గూర్చుండి కర్ణరసాయనముగా బిల్లనగ్రోవిని మోవిని బూని పాడెడి గోపబాలకుల గానములకు హృదయములు కరగి మేపులు చాలించి క్రేపులతోడ గూడి జెవులు నిక్కించి యర్రులు చాచి యాలింపుచు నడుమ నడుమ గడ్డిపఱకలు కొఱుకుచు బయిళ్ల యందు నిలుచున్న పశుగణములును, పడమటను నీలము వలెనున్న తేటనీటిపై సూర్యకిరణములు పడి యెల్లెడలను వజ్రపుతళుకులను బుట్టింప బలుతెరంగుల జలవిహంగంబులు పుట్టచెండ్ల వలె మీల బట్టుకొనుటకయి నీటం బడుచు లేచుచు బ్రవాహంబుతోడం బఱచుచుండ నఖండ గౌతమియు నేత్రోత్సాహము చేయుచుండును.
ఆ పర్వత పాదమునకు సమీపమున గోదావరి యొడ్డున నల్లరాతి బండ మీద జక్కగా మలచిన రామపాదములు వెలసియున్నవి. శ్రీరాముల వారు పూర్వకాలమున సీతాలక్ష్మణులతోడగూడ బర్నశాలకు బోవుచు త్రోవలో ఈ పర్వతసమీపమున నడచిననాటి పాదముల చిహ్నములే యవి యని యెల్లవారును నమ్ముదురు. కాబట్టి