పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యా రామపాదములను సందర్శింపవలె ననునభిలాషతో దూరదేశముల నుండి సహితము యాత్రాపరులు వచ్చి రామపాద క్షేత్రమున నఖండ గౌతమీస్నానము చేసికొని, కొండ మీదికెక్కి శ్రీ జనార్ధన స్వామి వారి దర్శనము చేసికొని, స్వశక్త్యానుసారముగా దక్షిణతోడి ఫలములను సమర్పించి కలిగినవారైన స్వామికి భోగము సహితము చేయించి మఱి పోవుచుందురు. అది దివ్యక్షేత్ర మగుట చేత జాతిమతభేదము లేక యెల్లవారును పులిమాగిరము, దధ్యోదనము మొదలుగా గల స్వామిప్రసాదమును స్వీకరించి కన్నులకద్దుకొని ముచ్చటనారగించి చేతులనంటుకొన్నదానిని కడుగుకొన్న నపచారమగును గనుక గరతలములు పయికెత్తి చేతుల కందినంత వఱకు దేవాలయ స్తంభములకును, గోడలకును వర్ణము వేయుటయే గాక తచ్ఛేషముతో దమ మీజేతులకును బట్టలకును మెఱుగు బెట్టుకొనుచుందురు.

ఈ కొండకు దక్షిణమునను తూర్పునను కొంత దూరము వఱకు గ్రామము వ్యాపించియున్నది. పర్వతము పేరే పూర్వము గ్రామమునకుం గూడ గలిగియుండెను. కాని యిప్పుడిప్పుడు గ్రామమును ధవళేశ్వరమని వ్యవహరించుచున్నారు. కొండ మీది నుండి సోపానములు దిగివచ్చిన తోడనే రాజవీధి యొక్క యావలి ప్రక్కను శ్రీ అగస్త్యేశ్వరస్వామివారి యాలయమొక్కటి లోచనగోచరంబగును. తొల్లి వింధ్యపర్వతము యొక్క గర్వము నణచి దక్షిణాభిముఖుడయి చనుచు అగస్త్యు డాస్వామిని అచట ప్రతిష్ట చేసెనని స్థలపురాణము చెప్పుచున్నది. ఈ దేవాలయమునకును పర్వతమునకును మధ్యను తూర్పుననుండి పడమటకు గోదావరి వఱకును విశాలమయిన రాజవీధి యొకటి గలదు. ఆ వీధి చివరను నల్లరాళ్లతో నీటి వఱకును సోపానములు కట్టబడియున్నవి. సోపానములకు సమీపమున వీధికి