- రాజశేఖర చరిత్రము
రాజ--- సర్వేంద్రియములకు సౌఖ్యము కలుగునట్టుగా, మార్గస్థుల సంతోషమునకై యిటువంటివాని నన్నిటిని సృజించి నిర్హేతుకిగాయమానకటాక్షముచేత స్వేచ్చముగా ననుభవింప ప్రసాదించినయీశ్వరుని మహత్త్వము నెఱిఁగి కొనియాడ మన యెంతవారము? మనమొన్నడును నిల్లుకదలకపోవుటచేత నిటువంటిసౌఖ్యముల నేమియుమెఱుఁగనివారమైయుండియు, మనమే యెల్లవారికంటెను మిక్కిలి సుఖపడుచున్నా మనుకొని గర్వపడుచుంటిమి. ఈ యడవులలోనే సదా కాపురముండి, దీనబంధువైన పరమాత్ముని యనుగ్రహమువలనఁ గలిగిన యీసౌఖ్యముల ననుభవించుచుండెడి యీ వనచరులైన కిరాతులు మొదలగువా రెంతటి యదృష్టవంతులు! ఆహా! గ్రామములో నెప్పుడును మనకీ వసంతకాల మింత మనోజ్ఞముగానుండలేదుగదా?
సీత- అమ్మా! నేనిఁకనడవలేను. నన్నెత్తుకో.
మాణి- ఆ చెట్టుదాఁకా నడచిరా. అక్కడ యెత్తుకొనెదను. రుక్మిణీ! వెనుకపడుచున్నావేమి? రెండడుగులు వేగిరముపెట్టు.
రుక్మి- అలవాటు లేకపోవుతచేత కాళ్ళుపొక్కు లెక్కినవి. వేగిరము నడవలేకున్నాను.
రాజ- పనులకాపరివాని నడిగాను. ఊరొకక్రోసున్నసఁట! రెండుజాములు కావచ్చినది. ఏలాగునైనను కొంచెముశ్రమచేసి నాలుగడుగులు వేగిరము నదువవలెను.
మాణి- సీత నెత్తుకొని నదుచుచున్నాను. ఆఁకలియగుచున్నదని యిది యేడ్చుచున్నది. మన కిడిచేతివైపున దూరముననేమో మనుష్యుల మాటలచప్పుడు వినవచ్చుచ్చున్నది. అది యూరేమోమన మీపూఁటదిగుదామా?