పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఎనిమిదవ ప్రకరణము

రాజ-చూచితిరా యీమఱ్ఱిచెట్టు ఆమూలాగ్రము చిగిరించి, పగడమువలె, యెఱ్ఱని పండ్లగుత్తులతో నెంత మనోహరముగానున్నదో!

సుబ్ర-ఔనౌను, దానిచేరువనున్న మామిడిగున్నచీనాంబరమువలె నున్న లేఁతచిగుళ్ళతో మఱిఁతవింతగానున్నది. కొనకొమ్మనుజేరి కోయిల యొక్కటి మధురమైన కంఠద్వనితోఁజెవులపండువునేయుచున్నది.

రుక్మి-నాన్నగారూ! రామచిలుక కొమ్మమీఁద తలక్రిందులుగా నిలచుండి జామపండునేప్రకారముగా ముక్కుతో పొడుచుకొని తినుచున్నదోచూడుండి.

సీత-అన్నయ్యా! నాకామామిడికాయ కోసియిచ్చెదవా?

సుబ్ర-అమ్మాయీ! చెట్టిక్రింద చిలకకొట్టిన దోరకాయలున్నవి తెచ్చుకో.(సీత పరుగెత్తుకొని పోయి నాలుగయిదు కాయలను తెచ్చుకొని కొఱికిచూచి పంచదారవలెనున్నవని చంకలుకొట్టుకొనుచున్నది.)

మాణి- ఎక్కడినుండియో యిప్పుడు గుప్పున మల్లెపువ్వులవాసన కొట్టినది!

సుబ్ర- అమ్మా! వేగిరము రా. అదిగో పొగడచెట్టుమీఁదనొక యడవిమల్లెతీఁగ అల్లుకొని, గంపలకొలఁది తెల్లని పుష్పములతో నిండియున్నది.మన యింటికడ నెన్నినీళ్ళు పోసినను, మల్లెపువ్వులీలాగున పూయవుగదా!

మాణి- ఆహా! పొగడపువ్వు లెంతసువాసన గలిగియున్నవి!

సుబ్ర- ఇప్పుడు పదిగడియలప్రొద్దెక్కినను, గాలి యెంత చల్లగా కొట్టుచున్నది! మన యింటివద్ద నెన్నఁడైన వేసవికాలములో గాలి యింతచల్లగానున్నదా!