పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కధ

కరణం కళ్యాణ్‌ కృష్ణకుమార్‌ 9848428978


“ఓరేయ్‌ ఈరేశం.. కాస్త ఆగరా... కాళ్ళు పీకుతున్నాయ్‌.. ఈ కొండరాయి మీద కూకుందాం” అంటూ రోడ్డు ప్రక్కన ఉన్న ఎత్తైన కొండరాయి మీద కూలబడ్డాడు రాధయ్య... “సరే ఈన్నే ఉండుమావా కొంచెం ముందుకెళ్ళి నీళ్ళేమన్నా దొరుకుతాయో సూసొస్తా”... అన్న ఈరేశం మాట పూర్తికాక ముందే... “వద్దులేరా..రెండు నిముసాలు కూలబడు.. ఎల్లిపోదాం” అన్నాడు రాధయ్య. పిడచ కట్టుకు పోయిన నాలికని తడపాలని, ఊరని లాలాజలం కోసం ఎండిన గొంతు చెలమలో ఆరాటపడుతున్న రాధయ్య చూపుకు వీరేశం చేతిలో నేల చూస్తున్న ఖాళీ సీసా వెక్కిరిస్తున్నట్లు కనిపించింది.

తలకీ మూతికీ కలిపి కట్టుకున్న తువ్వాలు తీసి చెమటలు కక్ముతున్నమొఖం తుడుచుకుంటూ “ఎంత దూర మొచ్చుంటాంమావా, శానా ఊర్లు దాటినంగానీ మనూరిప్పుడల్లా వత్తదంటావా “అంటూనే చుట్టూ పరచుకున్న ఎర్రటి ఎండకు మెరుస్తున్న కొాండలు , ఎండిన మట్టి పెళ్ళలూ + చూస్తూ దూరంగా రోడ్డుపై మోసం చేయాలని తపిస్తున్న ఎండమావుల్ని చూసి తనలో తానే నవ్వుకున్నాడు వీరేశం.

“ ఏంటి ఈరేశం.. అట్టా నవ్వుతున్నావ్‌...” చేవ లేని ఆ నవ్వుని చూసి అడిగాడు రాధయ్య,. “ఏంలేదు మావా ఇవన్నీ ఒకప్పుడు అడవులే అంటావా కంటిసూపు ఎంత సారించినా నీడిచ్చేసెట్టే లేకబాయే... మనం ఏడున్నాం మావా ఎడారిలో గాదుగదా!” వీరేశం అనుమానానికి రాధయ్య కూడా చుట్టూ చూసి తనలో తాను నవ్వుకుని సర్లే పద ఇలా కూర్చుంటూ పోతే రోజులెల్లిఫోతాయ్‌... అని అప్పటికే చెమట తుడుచుకోవడానికి తీసిన తలపాగాని చుట్టుకుంటూ..కొసను మూతికి కూడా చుట్టుకుని వీరేశం వెనుకే కదిలాడు, ఎల్ల లేవో తెలియని అనంత ప్రయాణం కానసాగింపుగా.

రాధయ్య, వీరేశంలు ఇద్దరూ ప్రకాశంజిల్లాలోని కరువు ప్రాంతమైన కనిగిరి సమీపంలోని పామూరుకు చెందిన రైతులు. రాధయ్యకు యాభై రెండేళ్ళుంటాయి. రాధయ్య అల్లుడే వీరేశం. వీరేశానికి ఇరవే ఏడేళ్ళుంటాయి. గ్రామంలో కరువు తాండవించడంతో నమ్ముకున్న భుమి కడుపు నింపడం లేదని ఏదో ఒకటి చేసి పట్నం. వెళ్ళి బ్రహ్మాడంగా బ్రతకొచ్చని ఆశ మొలకెత్తి, భార్యా పిల్లలని సొంత వూర్లో వదిలేసి, హైదరాబాద్‌ వెళ్ళి బిల్టింగ్‌ వర్కర్స్‌గా పనిచేస్తున్నారు. అనుకోని పరిన్టితుల్లో మాయదారి రోగమేదో వచ్చిందని, పని లేక, పస్తులుండలేక సొంత వూరి బాటపట్టారు లక్షల్లో ఇద్దరై. ఏ ప్రకృతీ వారిని మెత్తగా పలకరించలేదు. ఏ పిల్లగాలీ వారి చెమటను తల్లి కొంగై తుడవలేదు. ఏ చినుకూ యాత్రికుడై తరలివస్తున్న వారి కోసం వారబోసి ముందరి నేల తడిపి స్వాగతం పలకలేదు. రోళ్ళు పగిలే రోహిణీ ఎండ .. పురి విప్పిన నెమలై నాట్యం చేస్తోంది. అయినా నడక.. నడక..నడక. .. ఎడతెగక సాగిపోతున్న వారెవ్వరినీ ధగధగమంటున్న ఎండ మాత్రం ఏం చేయలేక పోతోంది. వారి సహనం ముందు ప్రతి రోజూ ఓడిపోతూనే ఉంది. వారి కాలికింద అసహానంగా నలిగిపోతోంది. ఆ

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

46