పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాహిత్యరంగం

బూర్ల వేంకటేశ్వర్లు 9491598040

ఆపత్కాలపు కవిత్వచూపు

పశ్చిమ ఆఫ్రికాలో 1981లో మొదలై ప్రపంచమంతా వ్యాపించిన HIV వైరస్‌ వలన మూడున్నర కోట్లమంది బలయ్యారు. 2009-10లలో వచ్చిన స్వైన్‌ ఫ్లూ మెక్సికోలో మొదలై ఐదు లక్షల మందిని పొట్టనబెట్టుకున్నది. 2015లో దోమల ద్వారా వచ్చిన జికా వైరస్‌ దక్షిణ, మధ్య అమెరికాలలో ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపింది. 2014-16లో వచ్చిన ఎబోలా వైరస్‌ పశ్చిమ ఆఫ్రికా గినీయాలో మొదలై పదివేల మందికి పైగా బలి తీసుకున్నది.2019లో మొదలైన కరోనా వైరస్‌ Coid19 వలన, ప్రపంచ వ్యాప్తంగా కోటీ డెబ్బై నాలుగు లక్షల మందికి పైగా ప్రభావితులయ్యారు. సుమారు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల మంది మరణించారు. భారతదేశంలో సుమారు పదిహేడు లక్షల మంది ప్రభావితులయ్యారు. ముప్పై ఆరువేల మందికి పైగా చనిపోయారు.

ప్రపంచ ప్రజలందరూ కరోనా వైరస్‌ వలన ప్రాణ భయంతో ఉన్నారు. రోజు రోజుకూ వైరస్‌ విస్తృతి వార్తలు వింటూ, దాని బారిన పడకుండా ఉండే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమాజంలోని పేద, ధనిక, వ్యాపార, మేధావి తదితర వర్షాలు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాయి. అయితే,మనష్యులు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు, వాళ్ళ బాధలను చూసినప్పుడు కవుల స్పందన ఎలా ఉన్నదో లేఖామాత్రంగాతెలపడం ఈ వ్యాసం ఉద్దేశ్యం.

11జూన్‌ 2020 నాటివాషింగ్టన్‌ పోస్టో The poetry that speaks best to the pandemic అనీ జార్డ్‌ టౌన్‌ విశ్వవిద్యాలయం సహ ఆచార్యుడు సేత్‌ పెర్లో(Seth perlow) ఒక వ్యాసం రాశాడు. ఈయన “The poem Electric; Technology and the American Lyric " రచయిత. ఆయన ఏమంటాడంటే, “ఎప్పుడైనా భయానక పరిస్థితులు ఏర్పడితే నేను నా విద్యార్థులతో ప్రముఖ కవుల ఒక ఫోయెం పంచుకుంటాను”. ఇది సెప్టెంబర్‌ 11 దాడుల తర్వాత నాకు అలవాటైంది అంటాడు. అనుకోని సంఘటనలు జరిగి, భయానక పరిస్థితులు ఏర్పడినప్పుడు, కవుల సాంత్వన వాక్యాలు మనస్సుకు మందులాగా పనిచేస్తాయి. భయాందోళనలను తగ్గించి, థైర్య విశ్వాసాలనిస్తాయి. ఈ సందర్భంగా ఆయన ఉదాహరించిన W.H.Auden రాసిన September 1, 1939 కవిత, W.S.Merwin రాసిన Separation కవితలునాటి స్థితిని ప్రతిబింబిస్తాయి.

W.H. Auden September 1, 1939 కవితలో “నేను భార్యకు నిజం చెప్తాను/ నేను నా పనిపై ఎక్కువ దృష్టి పెడదతాను/ వారి నిర్చంథ ఆటను తిరిగి ప్రారంభించడానికి/ నిస్సహాయ గవర్నర్లు మేల్కొంటారు/ ఇప్పుడు/ఎవరు చెవిటి వారిని చేరుకోవచ్చు/మూగవారి కోసం ఎవరు మాట్లాడగలరు?/ నా దగ్గర ఉన్నది స్వరంమాత్రమే/ ముడుచుకున్న అబద్దాన్ని విడుదల చేయడానికి,

  • * *

ఆకలి ఎటువంటి ఎంపికను అనుమతించదు/పొరుడికి లేదా పోలీసులకు/మనం ఒకరినాకరు ప్రేమించుకోవాలి లేదా చనిపోవాలి "అంటాడు. ఆపత్కాలంలో సామాన్యులకోసం తన గొంతు నిచ్చి అబద్దాన్ని విడుదల చేయిస్తానంటాడు. ఆకలి అందరికీ ఒక్కటేనని ఇప్పుడు అందరూ మానవీయ ప్రేమను ప్రకటించాలని అంటాడు. W.S.Merwin రాసిన Separation కవితలో "సూది బెజ్జంలోంచి దారం వెళ్ళినట్లుగా ఉంది నీవు లేని ఒంటరి తనం. ఇప్పుడు చేయగలిగిందల్లా నీ స్నేహపు రంగుల దారాలతో జ్ఞాపకాల్ని కుట్టుకోవడమే” అంటాడు.

వివిధ సందర్భాల్లో “ఒంటరితనం, ఓదార్పు, బౌతిక దూరం, గోడలమధ్యన జీవితం, ఆత్మీయులు లేకపోవడం, ఉన్నదంతా కోల్పోవడం” లాంటి సమస్యలను పాశ్చాత్య కవులు గొప్ప అనుభూతితో చిత్రించారు. సాంఘిక జీవితం గురించి చాలా గొప్ప కవితలు రాశారు. మన సన్నిహిత సామాజిక క్షణాలలో కూడా దూరమనేది పాత్ర పోషిస్తుందని గుర్తించారు. మనం ఇతరులతో ఉన్నప్పుడు కూడా ఒంటరితనవు లోతైన భావాలు మనలో తలెత్తుతాయని గుర్తుచేస్తారు. కొన్నిసార్లు మన దగ్గరి సంబంధాలు గొప్ప దూరాలకు వంతెనగా ఉండవచ్చని అంటారు.

తెలుగులో ఆధునీక వచన కవిత్వంలో అనేక పార్య్వాలున్నాయి. యుద్దాలు జరిగినప్పుడు, తుపానులు ఉప్పెనలు ముంచెత్తినప్పుడు, భూకంపాలు సంభవించినప్పుడు - మానవీయ కోణంలో ఎన్నో కవితలు రాశారు తెలుగు కవులు. కొందరు ఆధునిక వచన కవులు రాసిన కవితా పాదాలు ఈనాటి సందర్భానికి సరిపోయేవి కనిపిస్తాయి. దేవరకొండ బాల గంగాధర తిలక్‌ రాసిన 'నగరంపై పీడనీడ” అనే అసంపూర్తి కవితలో “పవిత్రాగ్ని హోత్రాల వద్ద/బజారులమ్మట రాజ ప్రాసాదాలవద్ద/ చేరిన యీ జనసందోహాన్ని చూడు ప్రభూ/ చిదిమితే పాల్గారే చిన్నారిబుగ్గలు/ ముక్కుతూ మూల్చుతూ ఉండే ముసళ్ళు/ మోహన యౌవన వనసుమాలు తరుణ వయస్కులు/ వీరందరినీ కనికరించు అవధరించు ప్రభూ/ ఈ నగరంపై ఏదో నల్లని పీదనీడ పడింది/ మృత్యువు తన భయంకరపాశాన్ని విసిరింది” అంటాడు. అందరికీ చిరపరిచితమ్టైన శ్రీ శ్రీ బాటసారి కవిత కూడా బకుకుతెరువుకోసం పట్నానికి వచ్చిన వలస జీవి కష్టాన్ని వర్ణిస్తుంది. నిఖిలేశ్వర్‌ రాసిన '“విథ్వంస రాగం” కవితలో “మసిగా మిగిలిన శరీరాలపై/ పారుతున్న రక్తం మడుగులోంచి/ఒక తల్లి చంకలో/ సిద్దాంతాల గంట్లు పడని పసిపాప/ మంచీ చెడూ తెలియని మరో ఇద్దరు పిల్లలు/ నడుస్తున్న భయాక్రాంత విహ్వలమైన ముఖాలు/ ప్రతిఫలించిన పృద్య్వీ నిర్మలత్వపు నిస్సహాయత” నేటి భయంకర కాలానికి సరిపోతాయి.

ఈనాటి విషమ పరిస్థితులకు కారణం ప్రకృతి విధ్వంసమే అని తలచినప్పుడు పాపినేని శివశంకర్‌ రాసిన “ఆకుపచ్చని లోకంలో” కవితా వాక్యాలు సరిపోతాయి. “బహుశా ఒక స్వార్ధాన్ని మోస్తూ మోస్తూ/ మనిషి నాగరికుడయ్యాడు/ స్వప్నం భగ్నమై దృశ్యం ధ్వంసమై/మట్టితో తొలి రక్త బంధం తెగిపోయింది/ తనకీ తన చుట్టూ ఉన్నదానికి సామరస్యం తీరిపోయింది/ అసహజత్వం అమానవీకరణ/సుడేసిన యంత్ర ధూమాల్లో మానవారణ్యాలు/ మానవారణ్యాల్లో ప్లాస్టిక్‌ చెట్లు/ లాభాల వేటలో పక్షీ పశువూ చెట్టూ చేమా అన్నీ పరాయివే/ చల్లని నీడలు కరిగిపోయాయి/ కిలకిలలూ కువకువలూ ఆవిరై/ నదులూ అంతర్నదులూ కలుషితాలై/ ఇప్పుడు ప్రకృతే మనిషికి ప్రథమ శత్రువు/ క్రౌర్యానికి రూపంలేదు-అది కనబడదు గాక కనబడదు/ నేల మూగది ఆక్రోశం వినబడదు గాక వినబడదు”

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

44