పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xx


--: పరిష్కరణము :---

ఈ తంజావూరు సరస్వతీమహాల్ గ్రంథాలయమునందలి యాంధ్రవిభాగమునఁ గల (D. 140) M. 283, సంఖ్యఁ గల ఉషాపరిణయగ్రంథముయొక్క యేకైక తాళపత్రప్రతియే యీ పరిష్కరణమునకు మాతృక . లిపి శుద్ధముగను నధికముగఁ బ్రామాదికములు లేకుండుట పరిష్కరణమునకుఁ గొంత సహాయకారిగా నుండినది. అందందుఁ గొద్దిగ గ్రంథపాతములు సాధ్యపడినంతవఱకు కుండలీకరణము (బ్రాకెట్సు) లచేఁ బూరింపఁబడినవి. వీలైనంతవఱకు నష్టమైన గ్రంథభాగములు కూడ నట్లే పూరింపఁబడినవి. అచ్చటచ్చట గ్రంథములోఁ బొసఁగనిచోట్ల మాతృకాపాఠము దిద్దఁబడి యథామాతృకపాఠములు క్రింద (foot note) నివ్వఁబడియున్నవి. మాతృకలో నచ్చటచ్చట లేఖకప్రామాదికములు కూడ లేకపోలేదు. అవికూడ వీలైనంతవఱకు దిద్దఁబడియున్నవి. అయినను నీ రసవత్తరమగు కావ్యఖండమును బరిష్కరించుటలోఁ గొన్ని స్ఖాలిత్యము లేర్పడియుండవచ్చును. వాటిని విజ్ఞులు మన్నింపఁ బ్రార్థన. ఈ యుత్తమగ్రంథమును బ్రచురించ నిశ్చయించి తత్పరిష్కరణభారము నాయందుంచి యాంధ్రసారస్వతమునకు నీయల్పీయమైన సేవయైనఁ జేయుటకు సదవకాశము నొసఁగిన సరస్వతీమహాల్ గ్రంథాలయకార్యనిర్వాహకసంఘ కార్యదర్శి యగు శ్రీయుత S. గోపాలన్ , B. A; B. L; గారికి నా మనఃపూర్వకాభివందనములు. వీలైనంతవఱకు ప్రెస్‌కాపీని నిర్దుష్టముగను శుద్ధముగను వ్రాయుట యందు చిరంజీవి N. విశ్వనాథము చూపిన శ్రద్ధ ముఖ్యముగాఁ బేర్కొనదగినది.

సకాలములో శుద్ధముగను నిర్దుష్టముగను ముద్రణము సాగించిన 'రత్నం' ప్రెస్ వారికి ధన్యవాదము లర్పించుచు నింతటితో విరమించుచున్నాను .


శుభమస్తు.

సరస్వతీమహాల్

గ్రంథాలయము, తంజావూరు.

మన్మథ చైత్ర శుక్ల ప్రతిపత్.

25-3-1955

విఠలదేవుని సుందరశర్మ