పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

119


క.

అతిభాస్వరమగు రూపము
నతిమానుషదివ్యతేజ మమరఁగఁ దాల్చెన్
రతిపతియు సత్ప్రభావో
దితమైన సనత్కుమారుదేహముఁ దాల్చెన్.

20


గీ.

వినుము రాజేంద్ర! యటువలె వెలసె విహగ
వాహనారూఢుఁడైన యావాసుదేవు
నిపుడును దలఁచితలఁచి మాహృదయపంక
జంబు లానందరసభరితంబు లయ్యె.

21


గీ.

అపుడు మధువైరి దక్షిణహస్తములను
జక్రకౌమోదకీఖడ్గశరము లలరె
సవ్యకరముల నాల్గిట సరవితోడ
శంఖకార్ముకఫలకపాశములు నమరె.

22


చ.

అట గరుడుండు పక్షజనితామితభీషణఘోషణానిల
స్ఫుటదచలేంద్రకూటతటచూర్ణమహావిటపావనీజుఁడై
తటిదయుతప్రభాజటిలతారతనుద్యుతి నిండ దిక్కులన్
బటుజవయుక్తిచేఁ బఱచె భాసురలీల నభోంతరంబునన్.

23


వ.

ఇట్లు గరుడుండు గగనమార్గంబునం జనుచుండఁ గృష్ణుఁ జూచి
బలభద్రుం డిట్లనియె.


క.

హారిహరిద్రావర్ణము
లీరూపము లొదవె మనకు నేమిట నిపు డా
మేరుశిఖరిచేరువ ను
న్నారమె యిదియేమి చెపుము నలినదళాక్షా!

24