పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

ఉద్భటాచార్యచరిత్రము


గీ.

ఇసుక చల్లిన రాలక పసరుడాలు
నాకు దళసరి హస్తిచర్మాంబరముగ
నలరి సాక్షాత్కరించిన హరునిఁ బోలి
పాదుకొనియుండు నక్కొండఁబాదపములు.

80


సీ.

వరయోగశక్తి శంకరు మనఃపద్మంబు
        పై జేర్చి మోదించు పాశుపతులు
హరసమారాధనాయత్తులై సందడి
        గా విహారము సల్పు దేవముఖ్యు
లఖిలదర్శనములయందు నిందుధరుండె
        పరతత్త్వమని చూచు పరమమునులు
నిటలలోచనుని తొల్లిటివిజయాంకంబు
        లమరఁబాడుచు నాడు ప్రమథవరులు


గీ.

పావడంబులు గెల్చి ప్రాభవము దాల్చి
భవునిసారూప్యమున నుండు భక్తజనులు
గలిగి జగదేకకల్యాణకరవిభూతి
లక్షణంబుల మించుఁ గైలాసశిఖరి.

81


చ.

గుహగణమాతృకావలులు కుంజరవక్త్రుఁడు భృంగియున్ మహా
మహిమయుతుండు నందియు సమంచితభక్తి సమృద్ధిఁ గొల్వ న
య్యహివలయుండు శంభుఁడు హిమాద్రిసుతారమణుండు తద్గిరిన్
రహి వహియించియుండు సురరాజముఖామరపూజితాంఘ్రియై.

82


క.

చిగురులఁ గ్రొవ్విరిగుత్తుల
నగజాధిపుఁ బూజసేయ నరుదెంచె ననన్
దగి యొక్కకాలమున నా
జగతీధరవనములన్ వసంతము దోఁచెన్.

83