పుట:ఉద్భటారాధ్యచరిత్రము.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

అట్టి ముదిగొండ వంశ మహాంబునిధి హీ
మాంశుడై నట్టి శ్రీ సుబ్రహ్మణ్యశర్మ
ప్రథితమైనట్టి యుద్భటారాధ్యచరిత
మచ్చు వేయించె బుధ మనోహరముగాగ
ఆంధ్రశైవవాఙ్మయము విఖ్యాతిఁ జెంద.


మ.

సుకవిస్తుత్యరసైకనవ్యకవితాశ్లోకుండు నౌ రామలిం
గ కవీశుండు, కుమార భారతి, లసత్కావ్యక్రియారీతిమా
తృక గాఁగన్ రచియించినట్టి కృతియే శ్రీ యుద్భటారాధ్యదే
శికచారిత్రము వాంధ్రసాహితికి సంసేవ్యంబు గాకుండునే.

ఆంధ్రసాహిత్యచరిత్ర నవలోకించిన ముదిగొండ వంశీయులగు గురువులు మనకు చాలమంది ప్రస్తుతు లగుదురు - ఆధునికయుగమున కైలాసవాసులు శైవాగమపారావారపారీణులు మహోపాధ్యాయ ముదిగొండ నాగలింగ శివయోగి, శైవవాఙ్మయవిశారదులు ముదిగొండ వీరేశలింగ శాస్త్రిగారు మొదలగువారు గలరు. నేడు, శివయోగ, శైవసర్వస్వ గ్రంథకర్తలు పండిత ముదిగొండ కోటయ్యశాస్త్రిగారు, విద్వత్కవులు ముదిగొండ జ్వాలాపతి లింగశాస్త్రిగారు, మధురకవి, ముదిగొండ వీరభద్రమూర్తిగారు ఉద్భటారాధ్యసంప్రదాయప్రవర్తకులై విలసిల్లుచున్నారు. ఇంకను వైద్యరాజులగు శ్రీ ముదిగొండ మల్లికార్జునరావుగారు మున్నగువారు, ఈ వంశమునకు కీర్తి దెచ్చుచున్నారు,

ముదిగొండ వంశీయుల చరిత్ర అను గ్రంథమున, నీ వంశీయుల సమగ్రవృత్తాంతము– ఆంధ్రదేశ రాజకీయ, సాహిత్య, సాంఘికరంగములలో వారు ప్రదర్శించిన విశేషములు - వివరముగా దెలుపనెంచితిని ఉద్భటారాధ్య వంశీయులైన మహినీయులందఱును నాయుద్యమమును సఫలీకృత మొనర్తురుగాక.

స్వాతంత్య్ర్యావతరణమైన వెనుక, నిట్టి శైవశాఖాచరిత్రము మనకున్నగాని, ఆంధ్రుల సంపూర్ణ సాంఘిక చరిత్ర మన కవగతము గాదు. ఈ దృష్టితో చూచిన పై గ్రంథమావశ్యకము.