పుట:ఉదాహరణపద్యములు.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6 త్రిపురవిజయము

చ. కదలదు తేరు రథ్యములు గట్ట నశక్యము సూతుఁడంటి మా
ముదుసలి చక్రముల్ సరసమోపవు విల్లు బరళ్ళు నారియున్?
గుదిగొను నమ్ము శార్ఙ్గమునకుం బనుపడ్డది గాన వింతపెం
పొదవఁ బురత్రయంబు నెటు లోర్చితివో త్రిపురాంతకేశ్వరా. 11

(జైతరాజు ముమ్మయ – విష్ణుకథానిదానము)

అర్ధనారీశ్వరము

ఉ. పామును హారము న్నెలయఁ బాపటసేసయు నేఱు మల్లికా
దామము తోలు దువ్వలువు దట్టపుభూతియుఁ జందనంబు మై
సామున జాలనందముగ సన్నిధి సేసినఁ జూడఁ గంటినే
నామదిలోఁ గుమారగిరినాథుని శైలసుతాధినాథునిన్. 1

(రావిపాటి త్రిపురాంతకుఁడు)



సీ. తల్లిదండ్రులతోడి తగు లొల్లకుండియుఁ
దల్లిదండ్రుల తోడి తగులు వలచి
కందర్పు మీఁది యక్కటికంబు సెల్లియుఁ
గందర్పు మీఁది యక్కటిక మొదవి
సంసార కేలీప్రసక్తిఁ వోదట్టియు
సంసారకేలీప్రసక్తి గలిగి
సగుణవిశేషయోజన ముల్లటించియు
సగుణవిశేషయోజనము మరఁగి
సగము పురుషుండు కంజాక్షి సగముగాగ
నర్థనారీశ్వరాకృతి ననువు పఱచి
హరుఁడు తల్లింగమధ్యంబు నందునుండి
హరివిరించుల కంతఁ బ్రత్యక్షమయ్యె. 2

(నిశ్శంకుని కొమ్మయ – వీరమాహేశ్వరము)