పుట:ఉదాహరణపద్యములు.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

విభూతికి—
సీ. భసితంబు వేదోక్తపదనిరూఢంబగు
భసితంబు మునిజనప్రాణపదము
భసితంబు సర్వేశుభక్తి కారాధంబు
భసితంబు సకలశుభప్రదంబు
భసితంబు దుర్మేఘపటలానిలంబగు
భసితంబు లోకైకపావనంబు
భసితంబు భవరోగభంజనౌషధమగు
భసితంబు ప్రత్యక్షభర్గమూర్తి
గీ. భసిత మనవరతాశేషభయహరంబు
భసిత మసమసుజ్ఞానవైభవకరంబు
భసిత మాభరణము యోగివిసరమునకు
భసితమహిమ వర్ణింపంగ బ్రహ్మతరమె.

సీ. కపిలవర్ణము గోవు కడునొప్పునందనాఁ
జనియించెఁ దద్గర్భమున విభూతి
నల్లనిమొదవు వర్ణనకెక్కు భద్రనాఁ
దద్గర్భమున భసితంబు వుట్టె
నెఱ్ఱని ధేనువు నేపారుసురభినాఁ
గలిగె భస్మంబు తద్గర్భమునను
పొగచాయగల యావు పొలుచుసుశీలనా
క్షారంబు వొడమె దద్గర్భసరణి
గీ. చిత్రవన్నియలను సురుచిరము దాల్చు
కఱ్ఱి మనోభిధాన మంగీకరించుఁ
బ్రభవమొందె దదీయగర్భమున రక్ష
పంచముఖముల నిట్లుద్భవించె భీతి.

(కుంటముక్కుల తిమ్మయ – శైవాచారసంగ్రహము)