పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సీ. జొంపంబులై కెంపుసొంపు సంపాదించు
చిగురాకు లెఱనింగిసిరి ఘటింప
శ్రేణులై యుద్యానసీమల కేఁగు కీ
రము లైంద్రచాపవిభ్రమ మొనర్ప
మూఁకలై యెలమావి మోఁకలపై వచ్చు
కొదమతేఁటులు[1] మొగుల్ గుములఁజేయ
సోనలై వెలువక జోరునఁ గురియు గ్రొ
వ్విరులతేనియ లతివృష్టి గాఁగఁ
ఆ. గొనలు మీఱి మీఁదికినిఁ బ్రాఁకు నవలతా
వలులు వానకాలవైభవంబు[2]
నంతరింప నవ్వసంతాగమం బంబు
దాగమం బనంగ నతిశయిల్లె. 29
 
మ. అలి ఝంకారరవం బుపాంగనినదంబై యింపుఁ బాటింపఁ గో
కిలబాలాకమనీయకోమలకుహూగేయంబులం గూడ మం
జులమందానిలనర్తకుండు మదనక్షోణీశు మ్రోలం గళల్
విలసిల్లె మధువేళఁ జూపె వనవల్లీలాసికాలాస్యముల్. 30

శా. ధమ్మిల్లంబుల బొండుమల్లియవిరుల్ దైవాఱఁ బాలిండ్లపైఁ
గమ్మందావుల పొన్నమొగ్గలసరుల్ గంపింప లీలారసం
బిమ్మై మీఱఁగఁ గర్ణపర్వములుగా హిందోళరాగంబులన్
సమ్మోదంబునఁ బాడిరందు వదనల్ చంచల్లతాడోలలన్. 31

గీ. విరియు బొండుమల్లెవిరులలో నెలదేంట్లు
వ్రాలి చూడ్కి కుత్సవం బొనర్చె
విషమశరుని రాజ్యవిభవంబు వనలక్ష్మి
కన్నువిచ్చి చూచుచున్న మాడ్కి. 32



  1. తేటుల
  2. వాకకాళ్ళవైభవంబు