పుట:ఉదయనోదయము (నారన సూరన).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క. శరణాగతజనరక్షా
కరణవిధా[1] జాగరూకకారుణ్యగుణా
భరణునకు నిత్యసత్యా
చరణునకును విమలకమలసమచరణునకున్. 71
 
క. అక్షయభాషాశిక్షిత
చక్షుఃకర్ణునకు భాగ్యసముదీర్ణున కా
ర్యక్షేమంకరవితరణ
సాక్షాత్కర్ణునకు వినయసంపూర్ణునకున్. 72

క. కోనాంబావల్లభునకు
నానమితనుదారనృపమహత్తరకృతికిన్[2]
భూనాథమంత్రిమౌళికి
శ్రీనాథధ్యానచతుర చిత్తాబ్జునకున్. 73

క. అతులితమధ్వాచార్యో
దితమతసిద్ధాంతపటుమతి వ్యాసమహా
యతిరాయగురుకృపాసం
తతవర్ధితవిష్ణుభక్తితాత్పర్యునకున్. 74

క. సారతరకొండవీటిమ
హాసామ్రాజ్యప్రాజ్యవైభవైశ్వర్యకళా
ధౌరంధర్యనిరూఢ
శ్రీరామప్రభుకృపావిశేషోన్నతికిన్. 75

క. ధీచతురవచోవర్తికి
నాచంద్రార్కస్థకీర్తి[3] కభనవసుమనా
రాచమనోహరమూర్తికిఁ
బాచామాత్యునకు సరసపాండిత్యునకున్. 76



  1. పదా
  2. నానమితదురారి నృపమనోహరకృతికిన్
  3. నాచంద్రార్కస్థాయికీర్తి; నాచంద్రస్థాయికీర్తి