పుట:ఉత్తరహరివంశము.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

ఉత్తరహరివంశము


క.

బలదేవుమేను సోకిన
వెలిమిడిచే వేఁకి సఱచి విటతాటముగా
నిలుగుటతో ములుగుటతో
నలమటతో సావులింత లంతంతకుఁ గాన్.

77


క.

జడనుం దాపము నిద్రయు
నిడువెండ్రుకతోడ నెగయు నిట్టూర్పులు సం
దడి గొని వడి గొని మదిలోఁ
జిడిముడి పడి కన్నుఁ గవయుఁ జిడిముడి వడఁగాన్.

78


వ.

తదవసరంబున గదుండు సగదుండయి గధాధరున కిట్లనియె.

79


క.

ఓ కృష్ణ! కృష్ణ! చిక్కితిఁ
జేకొను మభయంబు నాకుఁ జేయుము నాతం
డ్రీ! కాలఁ దొడఁగె నొడ లిదె
లోకాధిప! నీకృపాబ్ధిలో ముంపఁ గదే.

80


క.

నావుడుఁ గడురయమున వసు
దేవతనూభవుఁడు రేవతీరమణుని సం
భావనఁ గౌఁగిటఁ జేర్చిన
నావిర్భూతజ్వరాపహరణం బయ్యెన్.

81


వ.

ఇవ్విధంబున.

82


శా.

రాకాచంద్రికఁ దేల్చినట్లు, ఘనసారంబుం బయిం గూర్చిన
ట్లాకాశాపగనీర వ్రాల్చినటు, లాత్మానందయోగామృతం
బేకాంతస్థితిఁ గ్రోల్చినట్లు హరిచే నింపారు నాలింగన
స్వీకారంబున శీతలాంగధరుఁడై సీరాయుధుం డుండఁగన్.

83


క.

ఉభయగదమధ్యమునఁ గై
టభమర్దనుఁ డుండి యచ్చటన్ రణమునకై
యభిముఖునిఁ జేసె నొక్కని
విభు నొక్కనిఁ జేరి వింతవేడుక చూపన్.

84