పుట:ఉత్తరహరివంశము.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

217

గరుడని నెక్కి కృష్ణుండు బలభద్రప్రద్యుమ్నులతో దండయాత్ర వెడలుట

గీ.

ఆకసంబున వేంచేయుహరి సిద్ధ
సాధ్యచారణగంధర్వసంయమీంద్ర
వివిధసంస్తుతుల్ చెవుల పండువులు చేసె
జయజయారావములతోడ సకలదిశల.

17


తోదకవృత్తములు.

జయజయ మంగళసంగతరూపా!
జయజయ పావకసంభృతిరూపా!
జయజయ కల్పితసాగరతాపా!
జయజయ ఖండితంకరచాపా!

జయజయ మస్తకశస్తకలాపా!
జయజయ కౌస్తుభచారుకలాపా!
జయజయ కాళియసారదురూపా!
జయజయ కంసనృశంసహకోపా!

జయజయ ధౌతవిశంకటపాపా!
జయజయ మోహనిశామణిదీపా!
జయజయ పాదలసత్సరిదాపా!
జయజయ విక్రమశాసితభూపా !

18


చ.

జయజయ శంకచక్రధర శార్ఙ్గరగదాధర శ్రీధరాధరా!
జయజయ భక్తిభావితనిశాచరఖేచరచిత్తగోచరా!
జయజయ కిల్బిషాపనుద శాంతహృదాస్పదచిత్తసమ్మదా!
జయజయ భూతభావన ప్రజాకలితావన లోకపావనా!

19


మ.

జయ నారాయణ పుండరీకనయనా శార్ఙ్గీ జగన్నాయకా!
జయ పీతాంబర భక్తవత్సల విరించస్తోత్రపాత్రక్రియా!
జయ జంభారీవిరోధివిక్రమకథాశ్లాఘావిఘాతక్రమా!
జయ గోవింద ముకుంద మందరధరా శౌరీ మురారీ హరీ!

20