పుట:ఉత్తరహరివంశము.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

179

ఉషాకన్య స్వప్నముం గని పరితపించుట

శా.

ఆ దైతేయతనూజ నింగి వ[1]డు నాహర్మ్యంబుపై నొక్కనాఁ
డేదిక్కుం జెలిపిండు మెండుకొనఁగా నేకాంతనిద్రారతిన్
మోదింపం గలలోఁ గుమారుఁ డొకఁ డేమో చేసినం దాల్మి పెం
పేదన్ దిగ్గన మేలు కాంచి నయనోదీర్ణాశ్రుసిక్తాస్యయై.

82


క.

ఎలుఁగెత్తి యేడ్చుఁ దనకుం
దొలుసమ[2]రత నిక్కమైన [3]దురపిల్లుఁ గటా
కుల మిటు దూషిత మగునే
చెలులు నగం దనగుణంబుచే నని వగుచున్.

83


వ.

అట్టియెడం చిత్రరేఖ యనుచెలికత్తె పొడచూపి యుషాకన్యకచేతం దద్భీతి
కారణం బెఱింగి యల్లన బుజ్జగించి యక్కాంతతో నిట్లనియె.

84


చ.

నలినదళాక్షి నీవు బలినందనుకూఁతుర విట్టి నిన్ను మొ
క్కలమున నొక్కరుండు దనకౌఁగిటఁ జేర్చునె! యిట్లు కన్ను నీ
రొలుకఁగ వెఱ్ఱివే? వెఱవ [4]కోడక నొంపఁగ వాని కెన్ దలల్
గలవు విచారహీనవయి కంపము నొందకువే తలోదరీ.

85


వ.

అట్లు గాక.

86


చ.

గెలిచినవాఁడు నేఁడు రణకేళిఁ బురందరుఁ దద్గజేంద్రమున్
వెలిచినవాఁడు దేవతల వెట్టికిఁ బట్టినవాఁడు ధూర్జటిన్
విలిచినవాఁడు భ క్తిమయవిత్తమునన్ ధర నేకవీరుఁడై
నిలిచినవాఁడు శౌర్యమున నీజనకుండు భయం బిదేటికిన్.

87


క.

ఏయెడ భయమెఱుఁగరు దై
తేయాధిపరక్షితులు సతీ జగతి జనుల్
మీయింట నీకు నవమతి
చేయుదురే యొరులు నిప్పుఁ జెద లంటు నటే.

88
  1. డఁగా
  2. రతి
  3. దురుపిల్లు
  4. కోడకు నెవ్వగదేల యెవ్విధం, గలవు;.... నొంపగ నేరికేన్ తలల్, గలవె.