పుట:ఉత్తరహరివంశము.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

159


ఉ.

విఘ్నము చేసె దేల పృథివీపతిలోకము గప్ప మిచ్చె శ
త్రుఘ్నత రాజసూయమఖదోహలి మాజనకుండు సత్కృపా
నిఘ్నుఁ డొకింత దోడ్పడిన నిన్ను ముదంబునఁ జూచు నీశిరో
దఘ్నము లింకఁ దెమ్ము కరదానముగాఁ గనకంపుఁగాలువల్.

282


ఉ.

రాజుల కేను రాజ మఱి రాజశిరోమణి రాజు దేవతా
రాజికి నెల్ల నీవసమె రాసెదు నాసరివాఁడుగా విసీ
తేజము మాలి తంచు నతితీక్ష్ణశరం బరిఁబోసి యేసినన్
భ్రాజిత మయ్యె నప్డు హరిఫాలమునం దిలకంబు పోలికన్.

283


వ.

ఇ ట్లేటు వడి విచారించి.

284


మ.

ప్రకటస్యందనకేళికిం దగినసారథ్యంబు చేయంగ సా
త్యకిఁ జాలించి తదాత్తచిత్రగతి రథ్యాడంబరం బొప్ప దా
రుకుఁ డేఁగం గడికాఁడిపై హుతవహక్రూరాస్త్రసంధానకా
ర్ముకహస్తుండు మురాంతకుండు పలుకుం గ్రోధాంధుఁడై హంసుతోన్.

285


ఉ.

ఏమిర హంస! కంసనరకేంధనబంధురమఛ్ఛరానలం
బామిషముం గొనం గలదురా విడిపింపఁగ నిన్ను నేఁడు సం
గ్రామము చేసి నన్నడుగు కప్పము దర్పము నీకు నేల సా
నామునిబాధలం గమరినాఁడవు కాలినత్రాటిచందమై.

286


క.

నినుఁ బొరిగొనియెద నిదెపో
జనులు మునులు విని ప్రమోదసంపదఁ దేలన్
మనుజాధమ! యని తొడిగిన
యనలాస్త్రం బేసె నదరు లంటఁగ వాఁడున్.

287


క.

వారుణబాణంబున నది
హరించె మురారి యేసె వాయవ్యాస్త్రం
బారాజకుమారుం డది
బోరన మాహేంద్రబాణమున నడఁగించెన్.

288