పుట:ఉత్తరహరివంశము.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

155


మ.

వసుదేవుం డటె యుగ్రసేనుఁ డటె నన్వారించు వారంచుఁ గ్రో
ధసముల్లాసముతో హిడింబుఁడు మహాదంష్ట్రాగ్రసంఛన్నసై
న్యసమూహుం డయి తాఁకె నానృపులు బాహాసారముం జూపినన్
వెస మ్రింగెం గడుపార వీరవరులన్ విస్ఫారజిహ్వాగ్రుఁడై.

260


వ.

ఇట్లు ముందటం దలపడిన యదువృష్ణిబలంబులకు భయంకరుఁడై దౌడలు
గొఱుకుచుఁ దల విదుర్చుచు మిడిగుడ్లు ద్రిప్పుచు మీఁదులు చూచుచు బారలు
సాఁచుచు బారి సమరుచుం గడు ప్రక్కళించుచుఁ గాలం జరుముచు మేను వెంచుచు
మెడ నిక్కించుచు నరదంబుల నరదంబులతో నంటసిల నడుచుచుఁ దురగంబుల
దురగంబులతోఁ దుత్తుమురుగా దూటుచు దంతావళంబులతోఁ దలలు వగులం
దాఁటించుచు వీరుల వీరులతో విటతాటంబుగా విఱుగ వ్రేయుచుం బ్రళయకాల
రుద్రుండు ప్రజలపైఁ బరఁగు చందంబునఁ జటులగతిం జాలు మగలఁ జట్టలు వాపి
చవిగొను రుధిరపయఃపానంబునను మేదఃఖాదనంబునను మజ్జిమజ్జనంబుననుం జేవ
మిగిలి చేరినవీరు లాహారంబుగాఁ గుంభకర్ణుండు వానరబలంబుల మ్రింగు భంగి
దోఁప యదువృష్ణిసైన్యంబు నిరవశేషంబు చేయుచుం గదిసిన నా వృద్ధనృపతు
లిద్దఱు సాహసంబున గంఠీరవంబు తోడం దలపడిన తగళ్లకైవడి నారాక్షసు
తోడం దలపడి.

261


మ.

ఖరనారాచపరంపరం బఱపి వీకం దాకి పాతాళగ
హ్వరముం బోని నిజాస్యముం దెఱచి రక్షోధీశుఁ డన్నింటి ని
ష్ఠురుఁడై మ్రింగి తదీయ చాపములు రెండుం బట్టి ఖండించినం
దెరలం బాఱక యున్నవారిఁ గని యాదేవద్విషం డిట్లనున్.

262

ఉగ్రసేన వసుదేవులు హిడింబున కోడి పాఱుట

చ.

ముదుకల మాంసము న్మెదడు మోదముతోఁ గడుపార మ్రింగ నే
డొదవె మదీయభాగ్యమున నూరక నోరు సొరుండు రండు మీ
రదవదగాక నావుడుఁ దదాననదర్శనముక్తశస్త్రులై
మదమఱి పాఱి రానృపులు మానిసిదిండికిఁగాక భీతితోన్.

263


వ.

అట్టియెడ హలధరుండు.

264