పుట:ఉత్తరహరివంశము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

63


సీ.

ఇం దుండుహరుమౌళి నిందుండు పెద్ద యై
                 నెత్తంబు నిండువెన్నెలలు గాయ
నీగిరిరాజుపై నీఁగిరి గాఁబోలు
                 నఖిలదేవతలు నేకార్ణవమున
నిచ్చట విహరింప నిచ్చఁట సంయమీ
                 శ్వరులకు మోక్షంబు సందియంబె
యీనగాగ్రంబున నీన గాఁడినయంత
                 శిల నైన మున్నేఱు నెలవ కున్నె


తే.

యీవనము లీకెలంకులు నీనగంబు
లీకొలంకులుఁ గలుగ సింహేభశరభ
హరిణశార్దూలగంధర్వయక్షసిద్ధ
గణగణాంగనాగణనలు గానఁబడునె.

161

శ్రీకృష్ణుఁడు ద్వాదశవర్షంబులు తపస్సు చేయుట

మ.

అనుచున్ దద్ధరణీధరాధివరకూటారూఢుఁ డై మానసం
బనుకాసారము నుత్తరంబున విహంగాధీశ్వరున్ డిగ్గి గ్ర
క్కున వల్కంబు జటాభరంబు నమరం గూర్చుండి చర్చించెఁ బా
వనదేశంబు శౌరి ద్వాదశసమావ్యాప్తిం దపప్రాప్తిగాన్.

162


వ.

అట్లు విచారించి.

163


క.

ఫాల్గునమాసము మొదలుగ
ఫల్గునసఖుఁ డతులతరతపశ్చరణమునన్
వల్గదరివర్గహయఖుర
ఫల్గువు గానీక మనసు పదిలము చేసెన్.

164


గీ.

పుష్పములు గోయుఁ జక్రంబు భుజగవైరి
నఱకు నిధ్మము ల్గుశములు నందకంబు
తెచ్చుఁ బాంచజన్యము గాచు దెసలు శార్ఙ్గ
మెదుర నిలుచుండు గద సేయు నెల్లపనులు.

165