పుట:ఉత్తరహరివంశము.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

ఉత్తరహరివంశము


ప్రాసము దత్తదిక్తటనిరాసముఁ గంసవిరోధి గాంచెఁ గై
లాసము నభ్రవిభ్రమకిలాసము మేరుతటీవిలాసమున్.

159


వ.

కనుఁగొన్న నన్నగంబు కన్నులకు నందక మిన్నంది నందికృత నాందీ
సందానితవందనమాలాసందోహావిహరదృృందారకసుందరీహారఘటితనటనారంభ
విజృంభితరంభాకుచకుంభసందర్శనసంభావనాసుభగంభావుకకుబేరకుమార
సంభ్రమావతకరణరాణచరణఝణాయమానమణిమంజీరజ్ఞాపితసోపానపథోపగ
మ్యంబై , రమ్యంబై వెండియు వెండియుం బసిండియుం దడంబడు ననుటకుం దగి
కుందగిరిమల్లికాకుముదసముదయదాయాదసదాదితేయనీదీసుమేరుశిఖరవిసర
విసరదుదీచీముఖప్రవాహవిహరమాణవిరించిపురమహిళాపయోధరకుంకుమపరాగ
రాగచ్ఛవిచ్చురితతరంగపరంపరాపరార్థ్యఫేనపటపల్లవితవిగతరజతరుచిరుచిరత
రాధీత్యకాదిత్యకాత్యాయనీరమణశిరోభూషణశశాంకశకలవిలాసనిస్తంద్రచంద్రి
కావిళరదవాచీముఖరోచిర్ఘరీపరీతపరిసరపరిహృతతపనీయతటద్యుతినిపతదితరేతర
కాంతివినిమయంబై మునిమయంబై పాతాళంబును మూలంబును మేలంబు లాడునని
యాడుట కొనియాడుటగాదని తెలుపం దెలుపగు సహజప్రకాశంబునకు నవకాశం బొసం
గక భవానిసేవానిపుణపుణ్యజనేశ్వరపురపురంద్రీపునఃపునరాగనునరాగమనఃప్రియ
వదపల్లవపరిచయపరితఃప్రకటితప్రవాళప్రభావిభావ్యమానదశాననభుజాపరిఘ
సంఘాతవిఘాతవిఘట్టితవసుధాసనిబధ్ధవివరవినిర్యద్దర్వీకరసార్వభౌమఫణామణికిర
ణచ్ఛురణప్రావరణంబై వరణంబై దురితంబులం జొరనీక ఛందంబు గాకుండియు జగతీ
ధృతిప్రకృతిప్రతిష్ఠాంచితంబై దంతావళంబు గాకుండియుఁ గటకరవిగ్రహవిహారదా
నోన్నతంబై కాంతారూపంబు గాకుండియుం నలకాహితపుష్పకచారూఢముక్తాభిరామంబై
యట్లునుంగాక సంసారియుం బోలెఁ బ్రసౌషధిపూర్ణోదరం బయ్యును సకలాభరి
తంబై యనాత్మజ్ఞుండునుం బోలెఁ దుర్వర్ణసానుభవం బయ్యును నున్నతవంశధ్వని
ముఖరంబై యట్లుంగాక జామదగ్న్యుండునుఁ బోలె భృగుసంతతివర్ణనీయం బయ్యును
భూభృద్విగ్రహనిరూఢంబై నిఖిలనిర్జరలోకమకుటరత్నరాజినీరాజిపాదంబై రాజ
కళాధరు విడంబించియున్న నప్పు డప్పురుషోత్తముఁ డిట్లని విచారించు.

160