పుట:ఉత్తరహరివంశము.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

ఉత్తరహరివంశము

బదరికావనంబునఁ బిశాచద్వయంబు శ్రీకృష్ణునకు దృగ్గోచరమగుట

ఉ.

కుక్కలు వెంటఁబడ్డ నొక కొన్నిమృగంబులు వాఱె నెత్తురు
ల్గ్రక్కుచు నేలఁగూలె విశిఖంబులు నాఁటిన గొన్ని యున్నవే
దిక్కు నెఱుంగవయ్యెఁ గరదీపనికాయము చాయఁ బర్వఁగా
గ్రక్కున వచ్చి రంతట వికారశరీరపిశాచసైనికుల్.

120


వ.

అందులోన.

121


సీ.

వికృతాననంబులు విరళదంతంబులు
                 నిడుపైన దౌడలు నిక్కుమెడలుఁ
ముడివడబొమలును ముమ్మూలముక్కులుఁ
                 బల్లవెండ్రుకలును బడికితలలు
బొక్కిఱొమ్ములు లోఁతుఁబొట్టలు మిడిగ్రుడ్లు
                 గూనివీఁపులు నిడుఁగ్రొంకివ్రేళ్ళు
బూరకాళులు నీచఁబోయినచేతులుఁ
                 గోలమూఁపులు గుదిగొన్నతొడలు


తే.

నతిభయంకరగతి సూప నట్టహాస
కహకహారావములతోడఁ గాననయ్యె
దావపావకఘనశిఖాదగ్ధతాల
సాలసంకాశ మగు పిశాచద్వయంబు.

122


వ.

అందు నొక్కరుండు.

123


చ.

పిరిగొనఁ దాల్చు పెట్టముగఁ బ్రేవులు చుట్టి కపాలపాత్రలో
విరియఁ గలంచుఁ గ్రొమ్మెదడు, వెండ్రుక లేఱి తొలంగవైచు నె
త్తురు చవిచూచుఁ గండలు తుథూ యని క్రాయుఁ ద్రిశూలధారలం
జెరివిన ప్రేతమాలికలఁ జిమ్ముఁ బిశాచవిభుండు వేడుకన్.

124


వ.

మఱియొక్కరుండు.

125

(అచ్చ తెనుఁగు)

చ.

కఱచినపీనుఁగు న్వెడఁదకప్పెరయు న్మొలఁ బచ్చితోళులున్
బుఱియల పేరులు న్మెదడుపూఁతకు జుమ్మనిమూఁగునీఁగలుం