పుట:ఉత్తరహరివంశము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఉత్తరహరివంశము


గీ.

అనుటయు హలాయుధుం డియ్యకొని నృపాల
సంఘమును దాను వీడ్కొని చనియె నపుడు
హరియుఁ గైలాసయాత్రకు ననువు చేసి
తలఁచె సౌపర్ణు శతకోటితరణివర్ణు.

103


వ.

అంత.

104

శ్రీకృష్ణుఁడు గరుత్మంతుని నెక్కి కైలాసంబునకుఁ బోవుట

మ.

హరిదంతద్విపదంతకుంతశిఖరాహంకారనిశ్చింతని
ర్జరరాజార్జితవజ్రజర్జరితవిద్ఛాయైకరోమచ్ఛని
స్థిరవిద్యుత్ప్రతిపక్షవక్షుఁడయి వచ్చెన్ వైనతేయుండు భా
స్కరబింబప్రతిబింబ మంబరము మ్రింగం బారు చందంబునన్.

105


గీ.

వచ్చి నిజపాదపంకజావనతుఁడైన
వైనతేయుఁ గనుంగొని వాసుదేవుఁ
డల్లఁ గరపల్లవంబున నాదరించి
పయన మెఱిఁగించి యెక్కె నప్పక్షివిభుని.

106


వ.

ఇవ్విధంబు వివిధగతిసంచరణచాతురీధురీణ గరుడాధిరోహణంబున
నతిత్వరితంబుగా సములాసంబునం గైలాసంబుఁ జేర వచ్చునప్పుడు.

107


సీ.

వాచంయమోత్సంగ[1]వత్సలసారంగ
                 మురుచషాలస్థూలయూపశతము
ప్రాగ్వంశబంధురబహుగంధసాన్నాయ్య
                 మాగ్నీధ్రముఖ్యర్త్విగాశ్రయంబు
సుత్రామసఖయాయజూకసామాజికం
                 బాతిథేయమయోటజాజిరంబు
పటుధవిత్రపవిత్రపవనోజ్జ్వలత్రేత
                 మఘమర్షణజ్ఞశౌకాంచితంబు


తే.

సంతతబ్రహ్మచర్యసుస్నాతకంబు
పరమయోగినిరాకృతపాతకంబు

  1. వర్చస