పుట:ఆముక్తమాల్యద.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు

ఆముక్తమాల్యద

తృతీయాశ్వాసము

క.

శ్రీక్షితినీళా వర! దను
జోక్షప్రాణహర! దంష్ట్రికోత్కృత్తహిర
ణ్యాక్షక్షపాచర! కృపా
వీక్షాదృతబాహులేయ! వేంకటరాయా!

1


అవధరింపు. మ ట్లరిగి విష్ణుచిత్తుండు.

2

విష్ణుచిత్తుఁడు రాజసభ కేఁగుట

శా.

నిత్యంబున్ బ్రతిహారివాద మగుటన్ విజ్ఞప్తి లే కంపఁ, దా
నత్యూర్జస్వలుఁ డౌట భూపతియు సభ్యవ్రాతమున్ శంకమైఁ
బ్రత్యుత్థానముఁ జేసి నిల్వఁగ, సభాభాగంబు సొత్తెంచి యౌ
న్నత్యప్రోజ్జ్వలరాజదత్తవరరత్నస్వర్ణపీఠస్థుఁడై.

3


క.

ఆతిథ్యము గొని, హరి తన
చేతోగతి నొలయ, రంతు సేయని విద్వద్‌
వ్రాతంబుఁ జూచి “లాఁతుల
మా తరవా యుడుగ? మాటలాడుం” డనుచున్‌.

4


తే.

కతిపయోక్తులలోనె తత్ప్రతిభఁ దెలిపిఁ
నగవు దళుకొత్త రాజు నెమ్మొగముఁ జూచి
‘యీవు మాధ్యస్థ్యమున నున్న నేము గొన్ని
నొడివెదము మాట’ లని తదనుజ్ఞ వడసి.

5