పుట:ఆముక్తమాల్యద.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కటికిచీకటితిండి కరముల గిలిగింత
                   నెవ్వాఁడు తొగకన్నె నవ్వఁజేయు


తే.

నతఁడు వొగడొందు మధుకైటభారిమఱఁది
కళల నెలవగువాఁడు చుక్కలకు ఱేఁడు
మిసిమిపరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగులదొరజోడు రేవెలుంగు.

19


తే.

అనుధాధాము విభవ మహాంబురాశి
కుబ్బు మీఱంగ నందనుఁ డుదయ మయ్యె
వేదవేదాంగశాస్త్రార్థవిశదవాన
నాత్తధిషణాధురంధరుండైన బుధుఁడు.

20


క.

వానికిఁ బురూరవుఁడు ప్ర
జ్ఞానిధి జనియించె సింహసదృశుఁడు తద్భూ
జానికి నాయువు తనయుం
డానృపతికి తనయుఁడై యయాతి జనించెన్.

21


క.

అతనికి యదు తుర్వసులను
సుతు లుద్భటమంది రహితసూదనులు కళా
న్వితమతులు వారిలో వి
శ్రుతకీర్తి వహించెఁ దుర్వసుఁడు గుణనిధియై.

22


తే.

వానివంశంబు తుళువాన్వయ మయ్యె,
నందుఁ బెక్కండ్రు నృపు లుదయంబు నొంది
నిఖిలభువనప్రపూర్ణనిర్ణిద్రకీర్తి
నధికు లైరి తదీయాన్వయమునఁ బుట్టి.

23


మహాస్రగ్ధర.

ఘనుఁడై తిమ్మక్షితీశాగ్రణి శఠకమఠగ్రావసంఘాతవాతా
శనరా డాశాంతదంతిస్థవిరకిరలు జంజాటము ల్మాన్చి యిమ్మే
దిని దోర్దండైకపీఠిన్ దిరము పఱిచి కీర్తిద్యుతుల్ రోదసిన్ బ
ర్వ నరాతు ల్నమ్రులై పార్శ్వములఁ గొలువఁ దీవ్రప్రతాపంబు సూపెన్.

24