పుట:ఆముక్తమాల్యద.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నుదయార్కబింబంబు నొఱపు విడంబంబు
                   దొరలంగనాడు కౌస్తుభముతోడఁ


తే.

దమ్మికే లుండఁ బెఱకేల దండ యిచ్చు
లేము లుడిపెడు లేఁజూపులేమతోడఁ
దొలఁకు దయఁ దెల్పు చిఱునవ్వుతోడఁ గలఁ ద
దంధ్ర జలజాక్షుఁ డి ట్లని యాన తిచ్చె.

12

భగవద్వాక్యము

సీ.

పలికి తుత్ప్రేక్షోపమలు జాతి పెం పెక్క
                   రసికు లౌనన మదాలసచరిత్ర
భావధ్వనివ్యంగ్య సేవధి గాఁగఁ జె
                   ప్పితివి సత్యావధూప్రీణనంబు
శ్రుతి పురాణోపసంహిత లేర్చి కూర్చితి
                   సకలకథాసారసంగ్రహంబు
శ్రోత్రఘచ్ఛటలు విచ్చుగ రచించితి సూక్తి
                   నైపుణి జ్ఞానచింతామణికృతి


తే.

మఱియు రసమంజరీముఖ్య మధురకావ్య
రచన మెప్పించికొంటి గీర్వాణభాష
నంధ్రభాష యసాధ్యంబె యందు నొక్క
కృతి వినిర్మింపు మిఁక మాకుఁ బ్రియముఁ గాఁగ.

13


ఉ.

ఎన్నినుఁ గూర్తునన్న విను మే మును దాల్చిన మాల్య మిచ్చున
ప్పిన్నది రంగంమం దయిన పెండిలి సెప్పుము; మున్ను గొంటి నే
వ న్ననదండ యొక్క మగవాఁ డిడ, నేను దెలుంగురాయఁడ
న్గన్నడ రాయ! యక్కొదువఁ గప్పు ప్రియాపరిభుక్తభాక్కథన్.

14


ఆ.

తెలుఁ గ దేల యన్న, దేశంబు దెలుఁ గేను
దెలుఁగు వల్లభుండఁ దెలుఁగొకండ
యెల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి
దేశభాషలందుఁ దెలుఁగు లెస్స.

15