పుట:ఆముక్తమాల్యద.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బురాణపురుషుఁ బురుషోత్తముఁ బ్రణతార్తిహరు వాసుదేవు హృషీకేశు
నీశనుతు విభీషణవరదు ననంగజనకు రంగరమణుం గాంచి సహసమాగత
భాగవతపరిషత్సమేతంబుగాఁ దానం దనుజాతయుం బ్రమదభయభక్తి
రసమగ్నలై జయజయశబ్దంబులతో సర్వాంగాలింగితక్షోణితలంబు లగు
నమస్కారంబులు గావించి నిలిచి నిటలతటఘటితాంజలియై ఇట్లని నుతి
యించె.

34


తే.

విధిగృహాక్షయవిత్తసేవధికి శరణు
చిరకృతేక్ష్వాకుపుణ్యరాశికిని బ్రణుతి
ధనపతి భ్రాతృకుల దేవతకు జొహారు
నతమృడాదిక సుమనస్సునకు నమస్సు.

35


తే.

కొలుతు సర్వేశు సర్వాత్మకుని ననంతు
నప్రకాశు నభేద్యు సమస్తలోక
సముదయాధారు నణుసమూహములకును న
ణీయు నిన్ను ననాధారు నిత్యు సత్యు.

36


క.

నారాయణు భూప్రభృతిక
గౌరవవద్వస్తువితతికంటె మిగిలి పెం
పారు గరిష్ఠత గల పర
పూరుషు శరణంబు వేఁడి పొగడిన నిన్నున్.

37


తే.

అజశివాదిక మగు నీసమస్తజగము
నెందుఁ బ్రభవించు వర్తించు డిందు నట్టి
మహిమ కిమ్మైన నిత్యు సమస్తభూత
మయుఁ బరులకంటెఁ బరు మహామహునిఁ గొలుతు.

38


సీ.

పరపురుషునికంటెఁ బరుఁడనాఁ జనువానిఁ
                   బరమాత్ము, ముక్తికై పరమయోగి
పరిషత్తుచే సదా భావింపఁబడువాని,
                   నెవ్వనియందుఁ బ్రాకృతము లైన
సత్త్వాదిగుణముల సందడి లే దట్టి
                   విమలుని, సర్వభూతములకంటె