పుట:ఆముక్తమాల్యద.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

అలరెఁ బ్రియాళు వోర్తు ప్రియ మౌట వసంతముఁ బాడ, నప్పు డ
వ్వెలఁది సపత్ని 'భక్తికిని వేల్పులు మెత్తురు గాన రాగమున్
చలమునఁ దన్నుఁ బాడఁగ వసంతుఁడు దా దయచేసెఁ గాక, యా
యలె నిజశక్తి నా' యనుచు నాపసకుం గొదవెట్టె నీసునన్.

133


తే.

అధరసుధఁ ద్రాణిజతఁ బ్రాణి యగుచు మౌక్తి
కాండమాలిక నిడెను నాసాగ్రమౌక్తి
కంబ యనఁ జాలు నన లిచ్చె గతజరత్సు
మంపు వావిలి మొగ మూర్పు నింప నోర్తు.

134


చ.

ఘన మగు నాకు రాలి, తిలకం బతిరిక్తత నున్న, నోర్తు, లోఁ
గనికర మూని, కన్నుఁగవ గాయజుఁ డిల్లడ యిడ్డ తూపులే
యనువుగఁ నించెఁగాక, మఱి యంటక ముట్టక యొక్క చేష్టలే
క నెగడఁ జేసె నంట యిది కల్లనఁగా, నలరించెఁ జూపులన్.

135


తే.

సాంద్రమకరందవృష్టి రసాతలంబుఁ
దొరఁగు పువ్వుల భువియుఁ, బూధూళి నభము
నీక్రమత్రయి మాధవుఁ డాక్రమించె
నురువిరోచనజనితమహోష్మ మడఁగ.

136


క.

ఊడకొనఁ బడు మధూళిక
యోడికలకుఁ గ్రిందఁ గ్రమ్మి యుండెడు తేంట్లన్
నీడలు దిరిగియుఁ దిరుగని
జాడఁ దరు ల్వొలిచె నవ్వసంతపు వేళన్.

137


చ.

శతదశమంజరీధవళచైత్రనిశామలచంద్రికౌఘముల్
ధృతవియదంతకేశి వనవృక్షలతాంతరజశ్ఛట న్గళం
కితఁ గని కామినీకమనకేళియఁ బోఁ జెడవా నగాటవీ
కతక పరాగ మొక్కదెసఁ గ్రమ్మి యనచ్ఛత మాన్పకుండినన్.

138


సీ.

శైత్యపాండిములు దుషారాంతమునఁ జేరె
                   నిరులుకౌ న్ద్రాక్షపందిరుల విరుల,
వలయ గానము లయుక్తల కార్శ్యమునఁ జేరె
                   మలయంపుఁ గమ్మ వీవలుల నలుల,