పుట:ఆముక్తమాల్యద.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కొనిపోయి ధర్మగేహిని
కనురక్తి నొనంగఁ బొంగి యాయమయును జేఁ
పు నిజస్తన్యంబున లలిఁ
బెనిచె న్గో మొప్ప నిట్లు పెరుఁగఁ గ్రమమునన్.

6


సీ.

వాతెఱ తొంటికైవడి మాట లాడదు
                   కుటిలవృత్తి వహించెఁ గుంతలంబు
లక్షులు సిరులురా నఱగంటఁ గనుఁగొనె
                   నాడించె బొమగొని యాననంబు
సనుగొమ ల్నెగయ వక్ష ముపేక్షఁ గడకొత్తెఁ
                   బాణిపాదము లెఱ్ఱవాఱఁ దొడఁగె
సారెకు మధ్యంబు దారిద్ర్యములె చెప్పె
                   ఱొ చ్చోర్వ కిటు లోఁగఁ జొచ్చె మేను


తే.

వట్టిగాంభీర్య మొక్కఁడు పెట్టుకొనియె
నాభి నానాఁటి కీగతి నాఁటిప్రియము
చవుకయైనట్టి యిచ్చటఁ జనదు నిలువ
ననుచు జాఱినకరణి బాల్యంబు జాఱె.

7


శా.

హేమాభాంగ విభాధరారుణివక్త్రేందుప్రభాశీలఁ ద
ద్భామారత్నము వొంద దయ్యె మును దత్తద్వర్ణ యుక్తాఖ్యలన్
శ్యామాంకం బళి గర్వధూర్వహకచచ్ఛాయాచ్ఛటం గాంచెఁ నౌఁ
గా మున్నుర్వి శిరఃప్రధాన మనువాక్యం బెమ్మెయిం దప్పునే.

8


క.

ఆయత భుజైక చక్రుం
డా యదుపతి దొమ్మి గెలువ నడరు మరుని కా
లాయసచక్రపరంపర
లోయన నుంగరపుఁగురులు యువతికి నమరున్!

9


తే.

సకలసీమంతినీలోక సమతిశాయి
భాగ్యవర్ణావళులు వ్రాసెఁ బద్మగర్భుఁ
డనఁగఁ గర్పూరతిలక రజోవదాత
ఫాలమునఁ గుంతలశ్రేణి పడఁతి కలరు.

10