పుట:ఆముక్తమాల్యద.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

రాణింపఁ బలి తనపని
జాణై కొనుఁ, గొలుచు సంతసపుఁదఱిఁ, దొలఁగుం
దాణ చెడఁ గపుడు మానిషి;
నాణె మెఱుఁగ బచ్చు గాఁగ నరపతికిఁ దగున్.

269


సీ.

తద్‌జ్ఞమండలిఁ గూర్చి ధాతువుల్ దెలిసి హే
                   మాదులఁ గొని ప్రకృత్యనుగుణాల్ప
జీవనాహృతులచేఁ జెలఁగి మహాబలో
                   ద్రేకంబు మర్దన రిత్తఁ జేసి
స్నేహార్ద్రుఁ డగుచు నశేషంబుఁ బోషించి,
                   నరవర్ణముల తప్పుసరణు లుడిపి
సతతద్విజప్రతిష్ఠాశాలియై బలి
                   యించుపట్టులు బలియించి పలుచఁ


తే.

జేయు పట్టులు పలుచఁగాఁ జేసి తేజ
మెసఁగ శోధన మఱవక యెసఁగ వలయు
సాంగ రాజ్య మొకెత్తుగ స్వాంగ రాజ్య
మొక్క యెత్తుగ నృపతి యాయుష్యపరత.

270


సీ.

సౌఖశాయనిక భిషక్పూర్వకము కల్య
                   వేళఁ గార్తాంతిక ద్విజుల గోష్ఠి
జామువోవ నమాత్య సామంత పూర్వకం
                   బర్థార్జనస్థ కాయస్థ గోష్ఠి
దిన మధ్యమమున మర్దనమల్లపూర్వకం
                   బగు సూదసూపకృన్మృగయు గోష్ఠి
యపరాహ్ణమున దేవతార్చనాపూర్వకం
                   బార్యధర్మాది కృద్యతుల గోష్ఠి


తే.

భక్తిమీఁద విదూషక పూర్వకము పు
రాణ కవిగోష్ఠి, చారపూర్వకము సంజ
జాము గాయక గోష్ఠి, నిశన్ సుషుప్తి
పూర్వకము ప్రేయసీ గోష్ఠి పొసఁగుఁ బతికి.

271