పుట:ఆముక్తమాల్యద.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఘుణగణవిహరణఁ జివికిన
మణిధనువువఁ దొరుఁగు నుసి సమానము లై ద
ర్పణనిభనభమునఁ బరిణత
శణకణహరిణములు పాండుజలదము లొలసెన్.

141


క.

రవిశశిముకురములు శర
ద్యువతి మెఱుఁగుఁబెట్టుభూతియో యనఁ బర్వెన్
బవనాహతసప్తచ్ఛద
నివహపరాగంబు దివికి నిర్మలకాంతిన్.

142


స్రగ్ధర.

సంభూతజ్ఞప్తివాతాశనశయనము విశ్వంభరుం డూఁది దేవం,
గంభీరప్రక్రియామగ్నత డిగు జగతిం గ్రందుగాఁ బోఁచువర్షా
దంభోళిస్తూలరంధ్రోద్గతసితపృథుపాతాళజాతాంబుధారా
స్తంభంబు ల్పోలె నెన్ను ల్ధవళరుచి శరస్తంభపంక్తిం జనించెన్.

143


తే.

నీరజేక్షణుఁ డవ్వేళ నిద్ర దెలిసి
యడుగుఁ దనమీఁద మోపనో యవనిరమణి
కంటకితగాత్రి యయ్యె నాఁగా విపాక
పరుషకంటకశాలి మంజరులు వొలిచె.

144


మ.

స్ఫుటభూయోహృతిశంక వార్ధి నినరశ్ము ల్మిన్ను చేర్పం, దటి
చ్ఛట లౌర్వంబుగఁ గారుకొంచు, ఘనమై, క్ష్మాఁ దీఱ వర్షింప, న
చ్చొటనుం దోఁచి గ్రసింపఁ బోలుఁ గలశీసూనుండు! గాకున్న నా
క్కొటఁ దారాగ్రహభాస్కరేందుమణిశుకు ల్వ్యక్తమై తోఁచునే?

145


చ.

అలమలయాద్రి కుంభభవుఁ డన్కతకంబు శరత్తు కుండమం
కలి ప్రతిబింబ కైతవమునం దమ కిచ్చిన వారిదేవత
ల్తొలఁకులకేలఁ దాఁప నిడి తోమఁ గలం కడఁగెం, దదీయత
త్ఫలతకు హ్రస్వమౌటె కరి, తారక లంబువుఁ దేర్చునే యనన్.

146


చ.

ఇలకు సుధాసమత్వము రహింప శరజ్జలజాక్షి కుండమం
డలి సలిలంబుఁ గల్మష మడంగ మొగి ల్విరియెండఁ గాఁచుచోఁ
జిలుకు నిశారజఃపటలి చెన్ను వహించె దరంగపంక్తిపై
దళదరవింద కైరవ కదంబ కడార పరాగపూరముల్.

147