పుట:ఆముక్తమాల్యద.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చెందు నెఱసంజ కుంకుమ
క్రందునఁ గెంపెక్కుదివికిఁ గాశ్మీరత రా,
నిందుశిలాత్వము రవి గని
యెం; దోయముఁ గురియ నేల యిటు గాకున్నన్?

119


చ.

అలజలరాశినీటఁ బగ లర్కకరావళి చూలు దాల్పఁగా,
నెలమిన యీర్ష్య రాత్రి ధవళాంశుకరాళులు తాము దాల్ప, ద
జ్జలముల నాన మూఁగికొనుచాడ్పున నాడి వహించెఁ జూలు మ
బ్బుల నిల ముంచునీలఘనపుంజమువల్ల బలాకమాలికల్.

120


క.

ఉఱుము విని యలకకై దివి
వెఱఁ బఱచుమరాళపటలి విడిచినఁ బడున
క్కఱచిన బిసలవవిసరము
తెఱఁగున వడగండ్లు ధవళదీధితి రాలెన్.

121


క.

తటిదుత్సారితఫణభృ
త్పటలి నిరన్నంబు లయ్యఁ దక్కపు బర్హుల్
నటన; మతిహర్షహేతూ
త్కటలాభం బిడునె మది క్షుభ న్నీర్వట్టున్?

122


సీ.

రవిఁ జూచి కుడుచువారలకును గృకలాస
                   ములకును దృష్టి మిన్నులనె నిలిచె;
సంధ్యార్ఘ్యదాయిద్విజశ్రేణి కిలు సేరు
                   మొదవులకును భ్రాంతి మది జనించె;
హలజీవినందోహములకు బలాకికా
                   విసరంబులకు మంచి వెదలు దొరకె;
నెలమిఁ బొల్పగుయూఠికలకు సంతలకూట
                   ములకును మఱి విచ్చుమొగ్గ లొదవె;


తే.

నతిథిసంఘంబునకు నీనినట్టియెనువ
కదువులేఁగలగుమికి వాకట్టు లెసఁగె;
మట్టిమిద్దెలవారికి మరువనులకు
నెలఁతఁ బాసినవారికి నిదుర చెడియె.

123