పుట:ఆముక్తమాల్యద.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


స్రగ్ధర.

గ్రావాలం గేతకీకోరకకుటజరజోరాజి దూర్వాంకురశ్రీ
తో వీక్షింపన్ దిశానుత్రుటి మఱుపడుచుం దోఁచు, చిట్లొ తిరో
వావిర్భావంబులం బాయక పొరయ నభస్యాభ్రము ల్గప్పి, పై నెం
తే విప్పై పింఛికల్ బర్హిణులు దిరుగఁ, బెల్లింద్రజాలంబుఁ జూపెన్.

112


తే.

గిరులఁ దటజంబుతరువులఁ దొరగ పండ్లఁ
బుట్టె జంబూనదులు; గానఁ బొదవు మొగిలు
మేన నవి సోఁకునెడలు గామితఁ దటిచ్ఛ
లంబునను శుద్ధజాంబూనదంబు లయ్యె.

113


తే.

సురభిబడిఁ జన్న సప్తలాశోకకమల
కువలయామ్రాళికిఁ గదంబ కుటజ నీప
కకుభయూథిక లను సాయకములు మరున
కేను గల్గి గేదఁగిసురె యెక్కు డయ్యె.

114


క.

నటనపరకేకిపాత్ర
స్ఫుటయవనిక లన మొగిళ్లు పొదవెన్ భూభృ
త్తటుల, నవి యాకు దిను చిట
పొటరవము సెలంగెఁ దాళముల చప్పుడు నాన్.

115


చ.

జలధర ముప్పుతోఁ బులు పొసంగు రసం బని యప్పయోధి నిం
పొలయఁగఁ గ్రోలి, పై దధిపయోధియుఁ గ్రోలఁగఁ, బ్రాఁచి దౌటఁ బె
న్బులుసుఁ గరుళ్లు గ్రాయ, నవివో వడగండ్లన రాలెఁ, గానిచో
నిలఁ బడ వానిఁ దిన్నయపుడే చలిపండ్లు వడంగ నేటికిన్?

116


తే.

అపు డనళ్లకు డిగక మేఘాళి పొదువు
నచలములపైనె దొడ్డిక ట్టగుమృగాళి
జాడ చూపట్టె మీఁదిపర్జన్యధన్వి
నృపున కగుతెరవేఁటయాయిత మనంగ.

117


చ.

తడి తల డిగ్గి ముంప, జడతం దుదఱెప్పలఁ గన్ను వీడి, పు
ల్పొడచుచు నీరు ముంగఱల పోలిక ముక్కులఁ గూడ, నోరఁ గొం
తొడియుచు గూఁటికఱ్ఱ సగ మొత్తుచు ఱెక్క విదుర్పు మున్నుగా
వడఁకుటె కాక చేష్ట డిగె వక్షము పక్షులు జానువుల్ చొరన్.

118