పుట:ఆముక్తమాల్యద.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ళాంజలి బంధంబుగా మ్రొక్కి, కక్కసాన నిట్లు మ్రొక్కించి, హెచ్చి, యచ్చ
య్యాట మెడపడకయుండఁగాఁ జిగురుగుండెలువోలె నల్లుకొని గొల్లన నగు
నల్లోలాంగనల గల్లకోపంబునం గొట్టి కసరుజూపు నారాజసంఘంబుమీఁద
నిగుడ, మగుడ మఱుపడు కొమిరెహరిణలోచనల చలితకంకణసంకులక్రేంకా
రంబు లాననామోదమేదురాళిఝంకారంబుల బింకంబు లడంపఁ; జెవులసంకులు
లోవంకభుజంబులు కొంకిసిగలు గావిదుప్పటులు నొప్ప, నిమ్ము దెప్పరంబై
ముప్పున నప్పురంబుఁ జేరి, రసికజనబాంధవంబున బంధుజనవియోగంబు మఱచి,
గంధకలనాకుసుమస్రగ్గ్రధనాదుల నాంధ్యంబు లే కలరు నంధ్రదేశీయు లగు
గంధకారులు పాటిపాటి పద్యంపుమ్రొక్కులతో వెఱ్ఱివెఱ్ఱి కైవారంబులు
గౌరుతత్తడులపై వచ్చు రాచవారిపై నాఁడువారిపై నాళువారిపైఁ జల్లగాఁ
జల్లఁ, బెల్లెగసి సృష్టియెల్లను ముష్టీకరించుచు, నస్పష్టభేదయగు పరిమళసమష్టిం
బెట్టు పిష్టాతకంబు నభోమండలికిం జండాంతకంబై చండకరకిరణంబుల మాటు
పఱుపఁ, బన్నీరు నించిన తన్నీరుతిత్తులొత్త; వియత్తలంబునం బాఱి కై
వ్రాలు ధారల వాద్యంబులు దడిసిన విద్యోపజీవులు పుష్కరంబులు గ్రాఁప
నగ్గిరోయుచుండ; నమ్మొత్త మత్తఱి నృత్తంబుఁ జూడ నిలిచి మెత్తమెత్తన
నడుచుచుండు మిండతండంబునుం దారు నప్పిండు పుండరీకాస్య లవకాశంబు
గాంచి కాశకుసుమప్రతిఫలనపాండురంబులై పద్యాతిహృద్యపార్శ్వద్వయో
ద్యానపాదపంబులకుం బాఱు చెంగలువకాలువలకుం డిగ్గి కాసరీదధిమండ
మాసరంబులుగా బిసికి యారంబెట్టిన నారంగశృంగబేరభంగంబులతోఁ
గట్టిన కలమాన్నంపుఁజలిది పోకపొత్తులం గుడువఁ గూర్చుండ వీక్షించి;
కుక్షింభరత్వంబున క్షుత్క్షాములై తిరిగితిరిగి వేసారి యోసరిలిన దాసరిగుంపు వారి
పాల గోపాలభిక్ష బిక్షించి భక్షింపఁ దీరక్షోణుల నిలిపిన తోరంపు దివెదారికోలల
రంధ్రగోళంబుల నుత్కీలంబులై మండు ధగధగని జగజ్జ్యోతిదీపజాలంబుల
మధ్య ధూపకుండికాంగారముల నీరాఱఁ గ్రాఁచి, నాదుఁ బరికింప వాయించు
ధిమిధిమిధ్వానంబులకుం బెదరి యీవలి యుపవనశుకంబు లావలి కావలి యుపవన
శుకంబు లీవలికి దట్టంబుగాఁ గట్టనితోరణంబులై పఱవఁ, దలలు విసరుటయు
నోరు దెఱచుటయుఁ గేలు సఱచుటయుఁ దక్క మిక్కుటంబగు నక్కోలా
హలంబున నేపాటియుం బాట వినరాక మూకగట్టిన భాగవతజాతంబు లేతేర;
నూరూరి నంతనంతకుం దిరుగఁ బెద్ద లింటింట సంతరించిన పిలుకువాటుగోడి