పుట:ఆముక్తమాల్యద.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

చివురుఁబొట్లపుదోయి జెందమ్ము లనఁ దార్క్ష్యు
                   హస్తోదరముల దివ్యాంఘ్రు లమర
నునుఁగప్పుమేనఁ దోఁచిన తదూర్ధ్వచ్ఛాయ
                   లీలఁ దాల్చుపసిండిచేల మెఱయ
వ్రాలిన యోగివర్గము నిర్మలాంతఃక
                   రణములువోలె హారములు దనర,
సిరికిఁ బుట్టింటినెచ్చెలు లౌట మనవికి
                   డాసె మకరకుండలము లమర


తే.

శ్రిత సితచ్ఛద వాత్యాభిహత పరాగ
వలయమండిత కల్పశాఖలొ యనంగ
శంఖచక్రాంచితోరుహస్తములు దనర
దోచె గమలేక్షణుండు చతుర్భుజుండు.

11


క.

ఎప్పుడు హరి గని రమరులు
ముప్పదియును మూఁడుకోట్లు మునిఁ గనుఁగొనునా
రప్పుడు తత్కరములతో
విప్పిన గొడుగులును మించి వేగమ మొగిడెన్.

12


తే.

సమ్మద దిదృక్షు ఖస్థ రక్షః పిశాచ
పుంజ మహిభుక్పతత్త్రప్రభంజనములు
సోఁకఁ వెఱఁ బాఱెఁ కళ్లాన శూర్పవాత
ఘట్టనలఁ బాఱు పెనుఁబొల్లకట్టు వోలె.

13


క.

నీరంధ్రకుసుమధారా
సారచరచ్చంచరీకసంకులకలఝం
కారానుకారి సంస్తవ
కారి మునిస్తోమ సామగానం బెసఁగెన్.

14


తే.

అట్లు ప్రత్యక్ష మైనపద్మాక్షు నంత
రిక్షమునఁ గాంచి ముని ప్రమోదాక్షిజలము
నిగుడఁ బులకించి, కరటిఘంటికలె తాళ
ములుగ నిట్లని యమ్మహాత్ముని నుతించె.

15