పుట:ఆముక్తమాల్యద.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మ.

మును నాచెప్పిన రెంటిలోఁ బర మనన్ ముక్తాత్మ దూరం బుపా
సనఁ గావింప నమూర్త; మింక పదసంజం బబ్జగర్భాదిబ
ద్ధనికాయం బది మూర్త మైనను బరిత్యాజ్యంబు శశ్వత్త్రిభా
వనలం గూడుట నారురుక్షున కసేవ్యం బీద్వయంబు న్దుదన్.

78


వ.

ఆభావనాత్రయం బెద్ది యనినఁ చెప్పెద:- బ్రహ్మభావనయుం గర్మభావనయు
బ్రహ్మకర్మోభయభావనయు; నందు బ్రహ్మభావనాయుతులు సనందనాదులు.
దేవాదిస్థావరావరులగు ప్రాణు లందఱు కర్మభావనాభావకులు, హిరణ్యగర్భాదు
లుభయభావనాపరు; లీమూఁడుతెఱఁగులవారు భావనాత్రయాన్వితులు గావున
నీత్రివిధాత్మకరూపంబ సేవ్యంబు; సనందనాదులునుం బ్రాగ్బ్రహ్మకల్పంబుల
సంసరించుట భావనాబద్ధులె; యిబ్భావనాత్మకంబగు విశ్వంబుసంస్థితికి నవధి
దేవమనుష్యాదివిశేషజ్ఞానకర్మంబులు క్షీణించుటయ; యట్టి విశ్వంబై
తోఁచు హిరణ్యగర్భాదులకంటె నన్యంబు పరాఖ్యం; బిది ముక్తరూపం
బమూర్తంబై యుండునని మొదలు సూచించితిం గదా; తదాకారంబుఁ దేట
పఱిచెద; పూర్వోక్తదేవాదిభేదరహితంబై తద్భేదరాహిత్యంబున నిట్టి దట్టి
దని వచించుటకు గోచరంబుగాక యపక్షయాదిరహితంబును సచ్ఛబ్దవాచ్యం
బును నాత్మసంవేద్యంబునునై, జ్ఞానైకనిరూపణీయం బగుచు జ్ఞానశబ్ద
వాచ్యంబునుం దానయై, బ్రహ్మాత్మకం బగుట బ్రహ్మసంజ్ఞయం గాంచి
యొప్పు; మఱి భావనాత్రయాత్మకవిశ్వవైలక్షణ్యంబె లక్షణంబుగాఁగల యీ
రూపం బభ్యస్యమానయోగుండగు యోగికిం జింతింప నశక్యంబు; మఱి
యపరంబని చెప్పంబడిన హిరణ్యగర్బుండు వాసవుండు ప్రజాపతులు మరు
త్తులు వసువులు రుద్రులు ఆదిత్యులు తారకంబులు గ్రహంబులు గంధర్వ
యక్షరక్షోదైత్యాదిసమస్తదేవయోనులు మనుష్యులు పశువులు అద్రులు
సముద్రంబులు ద్రుమంబులు వెండియు నేకపాద ద్విపాద బహుపా దాపాదంబు
లగు నితరభూతంబులుం దదుత్పత్తిహేతువులుగా విలసిల్లునట్టి ప్రధానాది
విశేషాంతచేతనాచేతనాత్మకప్రపంచభావం బగు స్థూలరూపం బుపక్రాంత
యోగునకుఁ జింతింప శక్యంబు. శక్యమేనియుఁ దద్భావనాత్రయాత్మకం
బగుట నశుభాశ్రయంబు గావున ముక్తిసాధనంబు గా; దీ చెప్పఁబడిన సకల