పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

అయహలకును గియ్యలగును కచటతపవర్గుల నాల్గేసివర్ణములుగ
నొకటొకటికి యతి యొప్పును చాదులుశషసలు తమలోన క్షాకుఁ జెల్లు
లళలును గిల్క క్రారయు రేఫకుఁ జెలంగుఁ పభబభల్ వాకును బరగు వణలు
పొల్లక్షరములకుఁ బొసఁగు పవర్గు బిందూక్త మైనను మాకు నొనరుచుండు


తే.

పుఫుబుభులకు ముకారంబుఁ బూన్పవచ్చు
మఱి ఋకారంబు రేఫకు విరతియగును
వాడుకగ నుండుయతు లివి వరుసతోడ
శ్రీమదానందరంగ పార్దివపతంగ.

6


తా.

అకారయకారహకారములును, గియ్యముడికలయక్షరములు నొండొంటికి యతి చెల్లును. కఖగఘ, చఛజఝ, టఠడఢ, తథదధ, పఫబభ యీయైదువర్గములలో నాయావర్గములోని నాల్గక్షరము లొండొంటికి యతిఁ జెల్లును. చఛజఝుశషసక్ష యీ యెనిమిదియక్షరములు నొండొంటికి యతి చెల్లును. క్షకారము కవర్గముతోఁ జెల్లును. లకారమును, ళకారమును, వెలుపల గిలకగలయక్షరములును, క్రారవడిగలయక్షరములు నొండొంటికి యతి చెప్పవచ్చును. పఫబభవ యీయైదక్షరములు నొకటికొకటి యతి చెల్లును. నకారణకారములును, నకారపొల్లు గలిగినయక్షరములును నొకటికొకటి యతి చెల్లును. పఫబభ యీనాల్గక్షరములకు దాఁపలసున్న లుండినచో మకారమునకు యతి చెల్లును. పుఫుబుభు యీ నాల్గక్షరములును ముకారమును బరస్పరము యతి చెల్లును. స్వరములలోని ఋకారమునకును రేఫకును యతి చెల్లును. ఇదియంతయుఁ జాల వాడుకగా బహుజనులు చెప్పెదరు కావున నివియు, మహాకవిరాజులు, ప్రబంధములయందుఁ బ్రయోగించుయతులును, బ్రాసభేదములును వివరించెద.

ప్రాసములకు నాదిమకవి భీమనచ్ఛందమున (సంజ్ఞ 76)
క.

భాసురము లగుచు సుకర, ప్రాసానుప్రాసదుష్కరప్రాసాంత్య
ప్రాసద్విప్రాసత్రి, ప్రాసము అన షడ్విధములఁ బ్రాసము లమరున్.

7
మఱియు, ననంతచ్ఛందమున (1-35)
క.

సమనామప్రాసము ప్ర్రా, సమైత్రి ఋత్రియును బ్రాదిసమలఘువు విక
ల్పము బిందు వర్ధబింద్వా, ఖ్య ముభయసంయుక్తసంధిగతసంజ్ఞికమున్.

8


తా.

అని యివ్విధంబున సుకరస్రాసము, దుష్కరప్రానము, అంత్యప్రాసము, అనుప్రాసము, ద్విప్రాసము, త్రిప్రాసము, చతుష్ప్రాసము, సమనామప్రాసము, ప్రాసమైత్రి, ఋప్రాసము, త్రివిధప్రాసము, ప్రాదిప్రాసము, వికల్పప్రాసము, బిందుప్రాసము, అర్ధబిందుప్రాసము, ఉభయప్రాసము, సంయుక్తప్రాసము, సంధిగతప్రాసము, సమలఘుప్రాసము అనగా 19 విధముల ప్రాసములు వివరించినారు.