పుట:ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లంబకదంబ మంజులకలానికురుంబ గుణావలంబ నె
య్యంబున జానకమ్మ వరియించె హరిన్ వరియించు శ్రీవలెన్.

123


సీ.

కలితాబ్ధికన్యకాకలితశుభాగారు నభినవమదనమోహనశరీరు
నిఖిలలోకైకవర్ణితకీర్తివిస్తారు భానుసూనుసమానదానశూరు
విశ్వవిశ్రుతసర్వవిద్వజ్జనాధారు జాంబూనదాచలసదృశధీరు
ఘనసదాశివమహీకాంతప్రియకుమారు శ్రీ చిదంబరనాథనృపవజీరు


తే.

మానవిభవసమానసుశ్రీనిధాన, యైన త్రిపురసుందరి పెండ్లియాడెఁ గోరి
జనకసుకుమారి శ్రీరామచంద్రుఁ జేరి, పెండ్లియాడిన దారిన ప్రేమ మీఱి.

124


మ.

రవితేజున్ ఘనపుణ్యమూర్తిని యశోలంకారునిన్ వీరరా
ఘవునారాయణభూమిపాలకమణిం గారుణ్య సంశీలన
ర్మవచోజాలగుణాలవాల యగు శ్రీమద్రాజరాజేశ్వరీ
యువతీముఖ్య వరించె గౌరి వృషవాహుం బెండ్లి యైనట్టులన్.

125


సీ.

సంతతసత్యభాషాహరిశ్చంద్రుని వరనందగోపాలవంశచంద్రుఁ
డనఘుఁ డాతిరువేంగడాధీశుపౌత్రుఁడు తిరువేంగడక్షమాధిపతిపుత్త్రుఁ
డానందరంగభూజానిప్రియమమారుఁ డల పెరంబూరిసత్కులవిహారుఁ
డలమేలుమంగాంబ యరిమె పెంచినబాలుఁ డల కుమారతిరువేంగళనృపాలుఁ


తే.

డతులలక్షణవతి రూపపతి శుభవతి, పుణ్యవతిని యరుంధతిఁ బోలు కనక
వల్లిసతి నుల్లమలర వివాహమయ్యెఁ, గృష్ణమూర్తి రుక్ష్మిణిని వరించినటులు.

126


క.

ఈరీతి వేడ్క మీఱఁ గుమారీమణులకును సత్కుమారునకు మహో
దారతఁ గల్యాణమ్ముల, శ్రీ రంజిలఁ జేసి ముదము చేకొని వెలయన్.

127


సీ.

రాజాధిరాజులు రాయమన్నీలు సుబాదారులు వజీరు పౌఁజుదారు
సంస్థానపతులు నిజాముల్ నవాబులు వర్తకు ల్పాళయప్పట్లదొరలు
మొదలైనవారు సంపుగఁ బెండ్లివేడుక గనుఁగొని యాశ్చర్యకలితు లగుచు
నవరత్నభూషణాంబరగజాశ్వంబులు నదరులు ఘటియించి బదులుగాంచి


తే.

వీడ్కొనిన యంతనత్యంతవిభవ మొదవ, నల్లురకు మువ్వురకుఁ జాల నరణమిచ్చి
కూఁతురులు మదిఁ గోరిన కోర్కె లొసఁగి, యెసఁగి సౌభరిసంతతి పొసఁగి వెలయు.

128


సీ.

ఇటులు సమస్తధాత్రీంద్రులు వజ్జీర్లు బలురాయమన్నీర్లు పౌఁజుదార్లు
మొదలైనదొరలచేఁ బొగడిగల్ గైకొని పుత్త్రులు పుత్త్రికా పౌత్త్రు లాప్త
భృత్యులు మంత్రులు హితులు బంధువులతోఁ దామరతంపరదారి నలరి
యాసేతుశీతాచలాంతరావనియందు నాచంద్రతారార్కయశము నించి